చంద్రబాబు కఠిన నిర్ణయం.. ఇక వాళ్లతో కటీఫే!!

ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Update: 2022-08-16 03:06 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పార్టీ అధినేత చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయాలకు సైతం వెనుకాడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగిస్తున్నారు. బాదుడే బాదుడు, మినీ మహానాడు వంటి పర్యటనలతో దూసుకెళ్లిపోతున్నారు. పనిలో పనిగా కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను డిక్లేర్ చేసేస్తున్నారు. అలాగే అసమ్మతి ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార పీఠంపై కూర్చోవాలని చంద్రబాబు పక్కా ప్లాన్‌తో ఉన్నారు. రాజకీయంగా ఇతర పార్టీలను ఎదుర్కొనేముందు పార్టీలోని అసంతృప్తి నేతలను, అసమ్మతి సెగను రూపు మాపేందుకు వ్యూహరచన చేస్తున్నారు. 'ఇంటగెలిచి రచ్చ గెలువు' అన్న సామెతను అక్షరాలా పాటిస్తున్నారు. ముందు పార్టీలో ప్రక్షాళన చేపట్టి అనంతరం ఇతర రాజకీయ పార్టీలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పొలిటికల్ యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా సైలెంట్ అయిన నాయకులు.. గ్రూపు రాజకీయాలు నడుపుతున్న నేతలు స్వపక్షంలో విపక్షం మాదిరిగా వ్యవహరిస్తున్న వారిపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారట. అటు అధిష్టానానికి, అధినేతకు తలనొప్పిగా మారుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ కొత్తగా తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు. అటువంటి నాయకుల తీరుతో పార్టీ శ్రేణుల్లో కలవరం ప్రారంభమైంది. అయితే ఇలాంటి అసమ్మతి సభ్యుల వివరాలతో ఒక నివేదికను సైతం చంద్రబాబు రెడీ చేసుకున్నారని తెలుస్తోంది. వీరందరికీ ఉంటే ఉండండి.. లేకపోతే పోండి.. కానీ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోను.. అని చంద్రబాబు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. మెహమాటాల్లేవ్... పట్టింపుల్లేవు. బంధుత్వాలు.. అభిమానాలు అవేమీ లేవు. ఉన్నదల్లా పార్టీపై గౌరవం ప్రేమ. పార్టీని బలోపేతం చేయడం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఇదే నా కల. ఇందుకు సహకరించే వారితో నాలుగు అడుగులు ముందుకేస్తా. సహకరించని వారిని వదిలేసుకుంటా.. అని చంద్రబాబు అనుచరుల వద్ద బాహాటంగా అన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు ధోరణిలో మార్పు

2024లో జ‌రిగే ఎన్నిక‌లు అధికార వైసీపీకే కాకుండా ప్రతిప‌క్ష తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ త‌రుణంలో మొహ‌మాటాల‌కు పోవ‌డంకానీ, చూసీచూడ‌న‌ట్లుగా ఉండే ధోర‌ణిని విడ‌నాడ‌క‌పోతే పార్టీకి దీర్ఘకాలికంగా నష్టం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని భావించిన చంద్రబాబు కొంత‌మంది నేత‌ల‌ పట్ల క‌ఠినంగా వ్యవ‌హ‌రించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఎవ‌రైనా ఒక నాయకుడిని దూరం చేసుకోవాల‌ంటే చంద్రబాబు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. తర్వాత చూద్దాంలే అంటూ దాటవేత ధోరణిలోకి వెళ్లిపోతారు. వారివైపు త‌ప్పులున్నప్పటికీ చూసీ చూడ‌నట్లుగా ఉండేవారు. ఇందుకు ఉదాహరణ.. ఇటీవలి కేశినేని నాని వివాదం. కానీ అటువంటి ధోర‌ణే గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వ‌డానికి కార‌ణ‌మ‌ని, దాన్ని వ‌దిలించుకోక‌పోతే ఈసారి అధికారంలోకి రావ‌డం క‌ష్టమ‌ని తెలుగు త‌మ్ముళ్లు అధినేత‌పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చంద్రబాబు కూడా తాను పద్ధతి మార్చుకోవాలని అనుకుంటున్నారు. అలాగే పార్టీకి నష్టం చేసేవారిని దూరం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వైసీపీతో లాలూచీ పడే నాయకులే టార్గెట్

గ‌తంలో త‌న‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగిన‌వారు ఉన్నా.. విడ‌దీయార‌ని అనుబంధం ఉన్నా స‌రే.. ఇప్పుడు వారివ‌ల్ల పార్టీకి న‌ష్టం క‌లుగుతుంద‌నుకుంటే చాలు.. మొహ‌మాటం లేకుండా చెప్పేస్తున్నారట. అంతేకాదు పార్టీకి దూరం పెడుతున్నారు. పార్టీకే ప్రథ‌మ ప్రాధాన్యమ‌ని వారికి స్పష్టం చేస్తున్నారు. నాయకుడి రెక్కల కష్టం మీద, ప్రజల ఆదరణ మీద గెలుస్తూ వస్తున్న వారే టీడీపీలో ఎక్కువ‌గా ఉన్నారు. ప్రతిప‌క్షంలో ఉంటూ అధికార ప‌క్షంతో లాలూచీ ప‌డే నాయ‌కుల‌ను అధిష్టానం గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా అటువంటి వారితో కేంద్ర కార్యాల‌యం ఒక జాబితా త‌యారు చేసింది. ఇటీలే జ‌రిగిన తిరుప‌తి అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పార్టీకి బ‌లం ఉన్నప్పటికీ సొంత పార్టీ నేత‌లే వెన్నుపోటు పొడవడంవల్లే ఓటమి పాలైనట్లు అధిష్ఠానం భావిస్తోంది. దీనికి కారణమైన వారిని ఇప్పటికే పార్టీ పక్కన బెట్టింది.

ఇది టీడీపీలో ఇటీవల వచ్చిన స్పష్టమైన మార్పుగా పరిగణించవచ్చు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టినవారు ప్రస్తుతం అనుస‌రిస్తున్న తీరు ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో ఈ తరహా నేతలను చంద్రబాబు ఉపేక్షించ‌ కూడ‌ద‌ని నిర్ణయించుకున్నారు. ఉత్తరాంధ్రలో కొంద‌రు కీల‌క నేత‌లు, సీనియ‌ర్ నేత‌లుగా ఉండి మ‌ంత్రులుగా ప‌నిచేసిన‌ వారికి ప‌ద‌వులు లేవు.. టికెట్లు లేవు.. మీ ఇష్టం అని చెప్పేయ‌బోతున్నట్టు సమాచారం. వారికి బ‌దులు యువ‌తకు అవ‌కాశం ఇవ్వాలనే యోచ‌న‌లో బాబు ఉన్నారు. చంద్రబాబు తన విశ్వరూపం చూపిస్తే పార్టీలో ఉండే ఇటువంటి నేత‌ల‌కు గండం వ‌చ్చిన‌ట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అసమ్మతి నేతలతో వరుస భేటీలు

మరోవైపు పార్టీలో ఆధిపత్య పోరు, అసమ్మతి సెగలపైనా చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి కీలక వివరాలను చంద్రబాబు సేకరించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కీలక నేతలు అయినటువంటి అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకట్రావు, కావలి గ్రీష్మ, కోండ్రు మురళీమోహన్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీంతో ఈ వ్యవహారం చంద్రబాబుకు నచ్చడం లేదని వీరిపై కూడా ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే విజయనగరం జిల్లాలో మీసాల గీత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు, అలాగే గజపతి నగరం నియోజకవర్గం నుంచి కేఏ నాయుడు ఆయన సోదరుల మధ్య రాజకీయ వైరం ఇబ్బంది కరంగా మారిందని తెలుస్తోంది.

ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే మాడుగుల నియోజకవర్గ టీడీపీలోనూ అసమ్మతి సెగ రగులుతోంది. మాడుగుల ఇన్‌చార్జి కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రామానాయుడుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ అంశం పట్ల కూడా చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. వీరితోపాటు ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రకాశం జిల్లాలో దామచర్ల జనార్థన్, ఎమ్మెల్యే బాలాంజనేయ స్వామి ఇలా ప్రతీ జిల్లాలో ప్రతీ నియోజకవర్గం నుంచి అసమ్మతి సెగల వివరాలను చంద్రబాబు తెచ్చుకున్నారని దశల వారీగా వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

పార్టీకి కలిసొచ్చే వారికి పెద్దపీటే

పార్టీకి నష్టం చేకూర్చే వారిని ఎలా అయితే ఉపేక్షించడం లేదో పార్టీకి వారి వల్ల ప్లస్ అవుతుందని తెలిసిన వారిని టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలే రాజంపేట లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా గంటా నరహరి పోటీ చేస్తారని బహిరంగంగా ప్రకటించారు. చంద్రబాబు సమక్షంలో నరహరి చేరిన రోజుల వ్యవధిలోనే ఆయనను రాజంపేట లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించేశారు. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత డీకే ఆదికేశవులునాయుడి బంధువు నరహరి. డీకే సతీమణి, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ సోదరికి స్వయానా నరహరి అల్లుడు. నరహరి బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన పార్టీలో చేరడంతో రాజంపేట ఎంపీ సీటు ఖాయమనే ప్రచారం జరిగింది.

గత ఎన్నికల్లో డీకే సత్యప్రభ రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆమె కొన్ని అనారోగ్య కారణాలతో కన్నుమూయగా.. టీడీపీ రాజంపేటలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపే పరిస్థితి ఏర్పడింది. అయితే నరహరి అయితే బావుంటుందని భావించారట. ఆయన కూడా పార్టీలో చేరిన వెంటనే యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో జరిగే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆయన పేరును రాజంపేటకు ఫైనల్ చేశారు. మరోవైపు కడప లోక్‌సభ స్థానం నుంచి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిని బరిలోకి దించుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాజంపేట లోక్‌సభ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లకు కూడా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చల్లా బాబురెడ్డి.. పీలేరు నుంచి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించేశారు. 

మునుగోడు ఉప ఎన్నిక బరిలో తెలుగు దేశం పార్టీ? 


Similar News