Home Minister:‘వినాయక మండపాలకు చలాన్లు’..హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

వినాయక మండపాలకు ప్రభుత్వం ఎలాంటి చలాన్లు విధించట్లేదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.

Update: 2024-09-08 09:03 GMT

దిశ,వెబ్‌డెస్క్:వినాయక మండపాలకు ప్రభుత్వం ఎలాంటి చలాన్లు విధించట్లేదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవోను జగన్ ప్రభుత్వమే తీసుకు వచ్చిందని చెప్పారు. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయం రాగానే రూపాయి కూడా వసూలు చేయొద్దని చెప్పారని వెల్లడించారు. మరోవైపు పేటీఎం బ్యాచ్‌ను దింపి వైఎస్ జగన్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో నేడు(ఆదివారం) మీడియా సమావేశంలో హోం మంత్రి అనిత మాట్లాడుతూ..2022 లోనే గత ప్రభుత్వం గణేష్ మండపాలకు సంబంధించిన జీవో ఇచ్చింది. మేము ఆ జీవోలో ఉన్న దానిని చెప్పామంతే..కానీ, సింగిల్ విండో విధానంలోనే గణేష్ మండపాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని హోం మంత్రి చెప్పారు.

గత ప్రభుత్వ జీవోలో ఉన్న అంశాలను సీఎం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదు అని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సీఎం ఆదేశాలను మేము 10 రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించాం అన్నారు. ఈ నేపథ్యంలో ‘గణేష్ మండపాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు. మైక్ పర్మిషన్‌కు కూడా డబ్బులు తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లకు సంబంధించి సమగ్ర విచారణ జరుగుతోందని హొం మంత్రి అనిత వ్యాఖ్యానించారు.


Similar News