Janasenaతో తెగదెంపులకు Bjp రెడీ.. Tdpతో వద్దని హెచ్చరికలు!
మనసు ఒకరితో మనువు మరోకరితో అన్నచందంగా తయారైంది జనసేన పరిస్థితి. పొత్తు బీజేపీతో ఉంది. ..
- టీడీపీతో జనసేన బంధంపై బీజేపీ గుర్రు
- టీడీపీతో వెళ్లిన ఎవరైనా శత్రువే
- ఏం చేయాలో తోచనిస్థితిలో జనసేన
- 2014రిపీటా? లేక 2019 రిపీటా?
దిశ, డైనమిక్ బ్యూరో: మనసు ఒకరితో మనువు మరోకరితో అన్నచందంగా తయారైంది జనసేన పరిస్థితి. పొత్తు బీజేపీతో ఉంది. టీడీపీతో కూడా కలిసి వెళ్లాలని భావిస్తోంది. అంతేకాదు అటు పాతమిత్రుడు చంద్రబాబు నాయుడు కూడా రా రమ్మని అంటున్నారు. అయితే టీడీపీతో జతకడతామంటే కటీఫ్ అంటుంది బీజేపీ. నిన్న మెున్నటి వరకు ఆడా ఉంటా ఈడా ఉంటా అన్న జనసేన పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిపోయింది. బీజేపీతో కలిసి వెళ్ళాలంటే టీడీపీని వదిలేయాలి.. టీడీపీతో వెళ్తే బీజేపీని వదిలేస్తుంది. దీంతో ఏం చేయాలో తోచక తలపట్టుకుంటున్నారు పవన్ కల్యాణ్. రాష్ట్రంలో పవన్ కల్యాణ్, చంద్రబాబులకు ఎదురైన పలు ఘటనల నేపథ్యంలో ఒకరినొకరు పలకరింపులు, కౌగిలింతలు చేసుకున్నారు. ఈ పరిణామాలతో కమలదళం కస్సుమంటోంది. టీడీపీతో వెళ్తే జనసేనకు రాం రాం చెప్తామంటోంది. అంతేకాదు టీడీపీనే తమ శత్రువు అని చెబుతోంది. అలాంటి పార్టీతో జతకట్టిన ఏ పార్టీ అయినా శత్రువేనంటూ భారీ డైలాగులు కొడుతోంది.
పొత్తులో అధికారంలోకి..
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. వైసీపీ ఇప్పటికే ఎన్నికల కదన రంగంలోకి దిగిపోయింది. విపక్షాలు మాత్రం ఇంకా పొత్తుల వద్దే నిలిచిపోయాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయంపైనే పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉందని రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి బీజేపీ-జనసేన పొత్తులోనే ఉన్నాయి. టీడీపీ సింగిల్‌గా ఉంది. తమతో కలిసి వచ్చే పార్టీలతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది.
ఇదే తరుణంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ దగ్గరయ్యారు. 2014 ఎన్నికల్లో పవన్ మద్దతుతో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. దీంతో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అనంతరం జరిగిన పరిణామాలతో ఈ మైత్రి చెల్లాచెదురైపోయాయి. తలోకదారి పట్టుకుని వెళ్లిపోయాయి. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దీంతో ఈ మూడు పార్టీలు మేల్కొన్నాయి. వెంటనే బీజేపీ-జనసేన కలిసిపోయాయి. అయితే టీడీపీతో దోస్తీకి మాత్రం బీజేపీ నై అంటోంది. 2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలపై చేసిన ఆరోపణలు, విమర్శలను బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది.
కలిసే పోరాటమంటున్న టీడీపీ, జనసేన
గత ఎన్నికల పరాభవాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే స్నేహహస్తం అందించారు. కానీ ఏ పార్టీ మాత్రం ముందుకు రాలేదు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అడపాదడపా చంద్రబాబును కలిసి వస్తున్నారు. విశాఖలో పవన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనానిని కలిసి తమ సంఘీభావం తెలిపారు. కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం జీవోనెంబర్ 1 పేరుతో కుప్పంలో చంద్రబాబు పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. అయితే పొత్తులపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
టీడీపీతో కలిసి వేళ్తే దోస్తీ కటీఫ్
తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ కలిసి పయనిస్తామంటూ చేసిన ప్రకటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీడీపీతో కలిసేందుకు ససేమిరా అంగీకరించడం లేదు. టీడీపీని శత్రువుగా భావిస్తోంది. ఇటీవలే బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం వీరి బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో దగ్గరయ్యేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఉంటున్నాయని చెప్పుకొచ్చారు. దీనిపై పార్టీ హైకమాండ్‌తో చర్చిస్తామని తెలిపారు. అయితే తమ ప్రత్యర్థి మాత్రం టీడీపీ అని చెప్పుకొచ్చారు. టీడీపీతో ఏ పార్టీ కలిసి వెళ్లినా ఆ పార్టీ కూడా తమకు శత్రువేనంటూ బీజేపీ ప్రకటించింది.
అయినప్పటికీ పవన్ కల్యాణ్ టీడీపీకి దగ్గరవుతున్నారు. అయితే ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీతో కలిసి పయనిద్దామని, కానీ టీడీపీని మాత్రం రాజకీయ ప్రత్యర్థిగానే పరిగణించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీతో జనసేన కలిస్తే మాత్రం పొత్తుకు నీళ్లొదిలేయాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
పొత్తులైతే ఖచ్చితం
ఇదే పొత్తులపై జనసేన పీఏసీ మెంబర్ నాగబాబు సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తామని హింట్ ఇచ్చారు. అయితే ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలి.. సీట్ల సర్దుబాటు అవన్నీ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చూసుకుంటారని నాగబాబు ప్రకటించారు. కానీ బీజేపీతో ప్రస్తుతం పొత్తులో ఉన్నట్లు మాత్రం ఎక్కడా వ్యాఖ్యానించలేదు. ఈ పరిణామాలను పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే పోటీకి వెళ్తాయనే ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే పవన్ కల్యాణ్‌ను వదులుకునేందుకు బీజేపీ సైతం రెఢీ అయ్యిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2014 సినారియో మాదిరిగా ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తే బలమైన వైసీపీని ఢీకొట్టవచ్చని, కానీ సింగిల్‌గా వెళ్తే మాత్రం మళ్లీ వైసీపీదే అధికారమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే మూడు కలిసే పరిస్థితి కనిపించడం లేదు. మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా? లేక బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా?, లేదంటే మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా?, పోనీ ఎవరిదారి వారిదే అన్నట్లు సింగిల్‌గా పోటీ చేసి మళ్లీ అధికార పీఠాన్ని వైసీపీకి అప్పజెప్పుతాయా అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే.