చంద్రబాబుకు బిగ్ రిలీఫ్: ఆ కేసులో ముందస్తు బెయిల్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

Update: 2023-10-13 05:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి షూరిటీ, రూ లక్ష పూచీకత్తుతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసులో 79 మందికి బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో వారంతా జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 11న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై అదే రోజున ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.అంగళ్లు ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో సుదీర్ఘవాదనలు జరిగాయి. ఈ కేసులకు సంబంధించి వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఈ నెల 16 వరకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అలాగే ఈ నెల 12వరకు అంగళ్లు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంగళ్లు కేసులో ఈ నెల 12న ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది. ఇరువాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పు ప్రకటిస్తామని తెలిపింది. దీంతో శుక్రవారం ఉదయం అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

ఇప్పటికే పలువురికి బెయిల్

ఇకపోతే అన్నమయ్య జిల్లాలో అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం అంగళ్లు, ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈకేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్లను గత సోమవారం హైకోర్టు తిరస్కరించింది. అంగళ్లు కేసులో డీమ్డ్‌ కస్టడీగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు తరఫు న్యాయవాదులు మరోసారి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తునకు తన క్లయింట్ సహకరిస్తానని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అంగళ్లు కేసులో అక్టోబరు 12 వరకు అరెస్టు చేయవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి విచారణను శుక్రవారంకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు సైతం ముందస్తు బెయిల్ వస్తుందని అంతా భావించారు. అంతా ఊహించినట్లుగానే ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు సైతం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News