ఏనుగుల దాడిలో రైతు దుర్మరణం.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఉమ్మడి చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం పీలేరు మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.

Update: 2024-10-15 13:37 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఉమ్మడి చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం పీలేరు మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అటవీ ప్రాంతం నుంచి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఏనుగులు గుంపు హల్‌చల్ చేశాయి. దేవళం పేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో పంటలను తొక్కి నాశనం చేశాయి. ఇక పుంగనూరు నుంచి పీలేరు వైపునకు వెళ్తున్న ఏనుగుల గుంపు పీలేరు సమీపంలో ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలో ప్రవేశించబోతున్న సమయంలో అక్కడే ఉన్న రైతు చిన్న రాజారెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఏనుగుల గుంపు రైతుపై దారుణంగా దాడి చేసి చంపేశాయి.

తాజాగా ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఏనుగుల సంచారం వల్ల రైతు దుర్మరణం చెందడం పై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పై అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. మృతి చెందిన రైతు కుటుంబాన్ని అటవీ శాఖ అధికారులు పరామర్శించి భరోసా ఇవ్వాలని ఆదేశించారు. మృతుని కుటుంబానికి అందాల్సిన నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ అందించే కుంకీ ఏనుగులు వీలైనంత త్వరగా మన రాష్ట్రానికి వచ్చేలా చూడాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


Similar News