AP News:శిథిలావస్థలో రెవెన్యూ కార్యాలయం

నాయకులు, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ రెవెన్యూ కార్యాలయ భవనం.

Update: 2024-10-15 13:55 GMT

దిశ ప్రతినిధి,శ్రీకాళహస్తి: నాయకులు, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ రెవెన్యూ కార్యాలయ భవనం. ఎప్పుడు ఎక్కడ పెచ్చులు ఊడి పడుతుందో తెలియదు. ఎవరి పై పడుతుందో అంతకన్నా తెలియదు. అటు సిబ్బంది ఇటు ప్రజలు బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కార్యాలయానికి వస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఏర్పేడులో 1984లో భవన నిర్మాణం జరిగింది. ఈ భవనంలో రెవెన్యూ కార్యాలయం ఉంది. భవనం శిథిలావస్థకు చేరుకుంది. పలుచోట్ల పెచ్చులూడి పడుతున్నాయి. కార్యాలయంలో ఉండాలంటే సిబ్బంది భయపడుతున్నారు.

కార్యాలయంలోకి రావడానికి ప్రజలు కూడా భయపడుతున్నారు. స్లాబ్ పెచ్చులు ఎప్పుడు ఎవరి పై పడతాయో తెలియక అవస్థలు పడుతున్నారు. మంగళవారం కూడా కొన్ని పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ప్రమాదవశాత్తు ఎవరికి గాయాలు కాలేదు. 2018లో సమీపంలోనే మరో భవన నిర్మాణానికి పనులు ప్రారంభించారు. అయితే నిధుల కొరతతో నిర్మాణం ఆగిపోయింది. పాత భవనంలో ఉండలేక, కొత్త భవనం పనులు పూర్తి కాక అటు ఉద్యోగులు, ఇటు ప్రజలకు దిన దిన గండంగా మారింది. నాయకులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు.


Similar News