ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు.. రూ.23 కోట్ల ఆస్తులు అటాచ్

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీమెన్స్ కంపెనీకి చెందిన రూ.23 కోట్ల విలువైన స్థిర, చరాస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది.

Update: 2024-10-15 13:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నాటి ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబునాయుడిపై నమోదైన ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అక్రమాల కేసులో హైదరాబాద్ ఈడీ కార్యాలయం మంగళవారం రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబై, పుణె నగరాల్లో ఉన్న సీమెన్స్ కంపెనీ ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఈడీ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. ఏపీఎస్ఎస్డీసీకి చెందిన సీమెన్స్ ప్రాజెక్టులో మనీలాండరింగ్ కు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా.. ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది.

2014-19 టీడీపీ హయాంలో రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం జరిగిందని 2019-24 వైసీపీ సర్కారు ఆరోపించింది. గతేడాది ఈ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టై 52 రోజులపాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలై బయటికొచ్చారు. తాజాగా ఈ కేసులో ఈడీ ఇరవై మూడున్నర కోట్ల విలువైన సీమెన్స్ ఆస్తుల్ని జప్తు చేయడం గమనార్హం. 


Similar News