కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం.. బీసీల 33 శాతం రిజర్వేషన్‌పై కీలక నిర్ణయం!

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన స్పెషల్ మీటింగ్‌లో నూతన మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపింది.

Update: 2024-09-18 08:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు (బుధవారం) అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ మీటింగ్‌లో నూతన మద్యం పాలసీపై సుదీర్ఘ చర్చ జరిపిన అనంతరం వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను అధ్యయనం చేసి తయారుచేసిన మద్యం పాలసీకి ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఈ మధ్య భారీ వర్షాలకు గండ్లు పడి పొంగి పొర్లిన బుడమేరు సమస్యపై కూడా కేబినెట్ సుదీర్ఘ చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ఇలాంటి విపత్తులు మరోసారి ఎదురుకాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులంతా తమ తమ అభిప్రాయాలను సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతంకాకుండా అనుసరించాల్సిన కార్యచరణను సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. ఇక బీసీలకు ౩౩ శాతం రిజర్వేషన్‌‌పై కూడా చర్చించిన కేబినెట్ దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇవి కాకుండా రాష్ట్రంలో 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, పారిశ్రామిక అభివృద్ధి రేటు, విద్యుత్ సంస్కరణలపై కూడా మంత్రిమండలి చర్చించింది. అనంతరం వరదల సమయంలో కేంద్రం చేసిన సాయానికి మంత్రి మండలి ధన్యవాదాలు తెలిపింది. వరద నష్టంపై, నష్ట పరిహారంపై కూడా అదే స్థాయిలో కేంద్రం ఆదుకోవాలని కోరారు. చివరిగా మంత్రుల గ్రాఫ్, ఎమ్మెల్యేల పని తీరుపై అన్నింటిపై చంద్రబాబు ఆరా తీశారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ మంత్రుల గ్రాఫ్‌ను చంద్రబాబుకు అందజేశారు. అంతేకాకుండా వివిధ మంత్రిత్వ శాఖల నివేదికల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.


Similar News