ఏపీకి దెబ్బ మీద దెబ్బ.. అక్టోబర్ 20 తర్వాత మరో తుపాను?

అక్టోబర్ 20 తర్వాత ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Update: 2024-10-15 11:50 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి చెన్నైకు 500 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకి 600 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఇది వాయుగుండంగా బలపడి నెల్లూరు - చెన్నై ల మధ్య అక్టోబర్ 18 తర్వాత తీరందాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిప్రభావంతో విశాఖ నుంచి చెన్నై - పాండిచ్చేరి వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశాలు ప్రస్తుతానికి లేవని తెలిపారు. కానీ.. మరో నాలుగురోజుల పాటు దీనిప్రభావంతో భారీ వర్షాలతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.

వాయుగుండంగా మారే క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. అక్టోబర్ 20 తర్వాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది తుపానుగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నారు. వాయుగుండం, ఆ తర్వాత తుపాను.. రైతులపాలిట శాపాలుగా కనిపిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. ఇప్పుడు తుపానుల పాలవుతుందన్న ఆందోళన రైతన్నల్లో నెలకొంది. 


Similar News