ఇరిగేషన్‌కో న్యాయం… ఇతరులకు మరో న్యాయమా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: చెరువుల్లో మత్తళ్లు పొంగుతున్నాయని, ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తన విజయం చెప్పుకుంటోంది. ముఖ్యమంత్రి నుండి సామాన్య కార్యకర్త వరకు ప్రతిఒక్కరూ కాళేశ్వరం జలాల పాటే పాడుతున్నారు. కానీ దాని వెనక పనిచేసే కర్మయోగుల గురించి సర్కారు పట్టించుకోకపోవడమే విస్మయం కలిగిస్తోంది. ఓ విభాగంపై మమకారం చూపెట్టిన ప్రభుత్వం మిగతా విభాగాలను విస్మరించడంతో ఆయా శాఖల ఉద్యోగుల్లో నైరాశ్యం నెలకొంది. ప్రాజెక్టు పూర్తి చేసిన క్రెడిట్ ఒక్క నీటి పారుదల శాఖకే […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: చెరువుల్లో మత్తళ్లు పొంగుతున్నాయని, ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తన విజయం చెప్పుకుంటోంది. ముఖ్యమంత్రి నుండి సామాన్య కార్యకర్త వరకు ప్రతిఒక్కరూ కాళేశ్వరం జలాల పాటే పాడుతున్నారు. కానీ దాని వెనక పనిచేసే కర్మయోగుల గురించి సర్కారు పట్టించుకోకపోవడమే విస్మయం కలిగిస్తోంది. ఓ విభాగంపై మమకారం చూపెట్టిన ప్రభుత్వం మిగతా విభాగాలను విస్మరించడంతో ఆయా శాఖల ఉద్యోగుల్లో నైరాశ్యం నెలకొంది. ప్రాజెక్టు పూర్తి చేసిన క్రెడిట్ ఒక్క నీటి పారుదల శాఖకే దక్కుతుందన్న భావనతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇతర శాఖల వారిని విస్మయ పరుస్తోంది.
భూసేకరణే లేకుంటే…
ప్రాజెక్టు నిర్మాణానికి అంత్యంత కీలకం భూసేకరణ చేయడమే. దాని నిర్మాణానికి, ఇతర అవసరాలకు ఎంత భూమి అవసరం ఉంటుందో అంచనాలను ప్రభుత్వం ముందు ఇరిగేషన్ అధికారులు ఉంచుతారు. ఈ మేరకు భూసేకరణ జరిపేందుకు రెవెన్యూ అధికారులు పూర్తి వివరాలను సేకరించి, రైతులను గుర్తించి జాబితాను తయారు చేస్తారు. ఇందుకోసం గ్రామ సభలు ఏర్పాటు చేయడం, నిర్వాసితులను ఒప్పించి మెప్పించడం వంటి బాధ్యతలు రెవెన్యూ విభాగంపైనే ఉంటాయి. క్షేత్ర స్థాయిలో రైతులు తిరగబడ్డ వారిని సముదాయించడంతో పాటు ఇతరాత్ర ఎన్ని రకాల రిస్క్ అయినా కూడా రెవెన్యూ డిపార్ట్ మెంట్ వారు ఎదుర్కొవాల్సి ఉంటుంది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి పంప్ హౌజ్ కోసం భూ సేకరణ జరపడంలో మాత్రం రెవెన్యూ అధికారులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా ఆందోళనలు జరకుండా రైతాంగాన్ని ఒప్పించి మరీ భూ సేకరణ జరిపారు.
ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో ల్యాండ్ అక్వేషన్ చేసేందుకు సుమారు వంద మంది రెవెన్యూ డిపార్ట్ మెంట్ యంత్రాంగం పనిచేసింది. కనీసం రెవెన్యూ ఆఫీసుకు సొంత భవనం లేకున్నా రెవెన్యూ అధికారులు అష్టకష్టాలు పడి భూసేకరణ జరిపారు. ఇప్పుడు కూడా రెండో విడత భూ సేకరణకు సంబంధించిన సర్వేలు జరిపి సర్కారుకు పంపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు, కన్నెపల్లి పంప్ హౌజ్ సకాలంలో పూర్తి కానట్టయితే లింక్ వన్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయేవి. ఇదే ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణ విషయంలో నేటికీ ఆందోళనలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ లింక్ వన్ లోని నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి, సిరిపురం, గోలివాడ పంప్ హౌజ్ ల భూ సేకరణలో కీలకంగా పనిచేసింది మాత్రం రెవెన్యూ అధికారులేనన్నది వాస్తవం. ప్రాజెక్టు నిర్మాణంలో తొలి అడుగు అయిన భూ సేకరణలో విఫలం అయితే ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ రెవెన్యూ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం యాగ్జిలరీ ప్రమోషన్లు ఇవ్వకపోవడం విడ్డూరం.
సెక్యూరిటీ లేనట్టయితే…
భూ సేకరణ సర్వే నుండి మొదలు ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అన్ని రకాల పనుల్లో వీరిది మాత్రం అత్యంత కీలక భూమికే అని చెప్పాలి. భూ సేకరణ కోసం జరిపిన సర్వే సమయంలో దాడులు జరిగితే ఎలా అని ముందస్తుగానే బందోబస్తు చర్యలు చేపట్టినప్పటి నుండి ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేవరకు మావోయిస్టుల దాడులను తిప్పికొట్టేందుకు పనిచేసింది పోలీసులే. అయితే ఈ పోలీసు విభాగాన్ని కూడా సర్కారు పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది. యాగ్జిలరీ ప్రమోషన్లే అయినా ప్రోత్సహాకాలే అయినా వీరికి మాత్రం అందలేదు. దీంతో సుమారు ఐదేళ్ల పాటు క్షేత్రస్థాయిలో పనిచేసిన పోలీసులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
ఇరిగేషన్‌కు మాత్రమేనా..?
అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావడం వెనుక ఒక్క ఇరిగేషన్ విభాగం మాత్రమే పనిచేసింది అన్నట్టుగా బావిస్తుండడంతో ఇతర శాఖల అధికారులు నిరుత్సాహ పడుతున్నారు. మొదటి దశలోనే భూ సేకరణ పూర్తికాకపోతే ప్రాజెక్టు పూర్తయ్యేది కాదన్న విషయం సర్కారు పెద్దలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి అన్ని విభాగాల వారిని కాపాడకపోతే ఎన్ని దుశ్చర్యలకు అవకాశం ఉండేది అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉంది. కానీ ఇరిగేషన్ వింగ్ మాత్రమే గ్రేట్ అన్న రీతిలో సర్కారు భావిస్తుండడమే ఆయా శాఖల అధికార యంత్రాంగంలో విస్మయానికి కారణమౌతోంది.