తెలంగాణ టీడీపీ మద్దతు కాంగ్రెస్‌కేనా?.. మద్దతుపై స్పష్టతనివ్వని చంద్రబాబు!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి ఓటు బ్యాంకు ఉంది.

Update: 2024-05-05 02:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ తెలుగుదేశం పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి ఓటు బ్యాంకు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ విజయోత్సవంలో ఆ పార్టీ జెండాలు గాంధీభవన్‌ ఎగిరాయి. కాంగ్రెస్‌కు మద్దతుపై ఆ పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ లోలోపల మాత్రం కాంగ్రెస్ వైపేనన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఖమ్మం, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఆ పార్టీ కేడర్ ఉంది. పోటీకి దూరంగా ఉండడంతో పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందని, మరోవైపు ఏ పార్టీకి మద్దతు అనేది తేల్చకపోవడంతో చివరకు కేడర్ పరిస్థితి ఏంటనేది తెలియక ఆందోళనకు గురవుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బాసటగా...

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేడర్ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచింది. టీడీపీ జెండాలతో ఎన్నికల ప్రచారంలో దిగి, కాంగ్రెస్ కు ఓటువేయాలని విస్తృత ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ విజయోత్సవ సభల్లో టీడీపీ జెండాలు గాంధీభవన్ లో కనిపించాయి. అన్ని సెగ్మెంట్లలో ఓటును హస్తంకు మళ్లించాయి. ఇప్పుడు సైతం అసెంబ్లీలో వ్యవహరించిన తీరునే కొనసాగించాలని పార్టీ కేడర్ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర కమిటీలో ఓ కీలక వ్యక్తి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు బాసటగా ఉంటే కేడర్ కు సైతం భరోసా ఉంటుందని తెలిపారు.

చర్చనీయాంశమైన సుహాసిని భేటీ..

ఏప్రిల్ మొదటివారంలో సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ సీనియర్ నేత నందమూరి సుహాసిని భేటీ అయ్యారు. అప్పుడు ఆమె కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగింది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌ పరిధిలో సుహాసినికి కేడర్ ఉంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసి వస్తుందని ఆపార్టీ అధిష్టానం భావించినట్లు సమాచారం. అయితే ఆమె పార్టీలో చేరలేదు. మరోవైపు చంద్రబాబు, రేవంత్ రెడ్డి దోస్తీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ విమర్శలు సంధించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీ కేడర్ పరోక్షంగా కాంగ్రెస్ కు సపోర్టు చేస్తుందన్న ప్రచారంతో కేటీఆర్ వ్యాఖ్యలకు బలం చేకూర్చినట్లయింది.

Tags:    

Similar News