కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దాని విలువ జీరో : ఈటల రాజేందర్

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దాని విలువ జీరో అవుతుందని బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.

Update: 2024-04-16 08:25 GMT

దిశ, మేడ్చల్ టౌన్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దాని విలువ జీరో అవుతుందని బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. పేదవాళ్ల బతుకులు మరింత బాగుపడాలన్నా, దేశంలో సుస్థిర పాలన కొనసాగాలన్నా ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మరోసారి నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలని ఈటల కోరారు. మంగళవారం షామీర్పేట్ చెందిన మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, ఈశ్వర్ గౌడ్, పరమేష్ యాదవ్, మహేష్ యాదవ్ తదితరులకు బీజేపీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..


బీజేపీలో చేరితే త్యాగం చేసినట్టు లెక్కని త్యాగదనులకు, స్వార్ధపరులకు మధ్య ఈ పోటీ జరుగుతుందన్నారు. ప్రలోభాలకు డబ్బులు, బిల్లులు, పదవుల కోసం కాంగ్రెస్‌లో చేరుతుంటే బీజేపీలో మోడీ సనాతన ధర్మం కాపాడటానికి, దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి చేరుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ నాయకులను చేర్చుకుంటే ఎలా చేర్చుకుంటారని కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే పని చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోతే నేరుగా అమలు చేసే బాధ్యత మోడీ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.


రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎంపీ ఎన్నికలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు ఏమైనా సంబంధం ఉందా అని ఈటల ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ కొత్త అవతారం ఎత్తారని మొత్తం 17 సీట్లు గెలిపిస్తే అన్ని హామీలు అమలు చేస్తా అనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. మోకాలికి బోడి గుండుకు ముడి పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజాధరణ లేదన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ యాదవ్, రామచందర్, సూరి, యోగి, కస్తూరి, నాగులు తదితరులు పాల్గొన్నారు.


Similar News