లోక్‌సభ బరిలో మాజీ సీఎంల కొడుకులు.. 43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా

Update: 2024-03-12 17:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 43 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను మంగళవారం ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అసోం(12), గుజరాత్(7), మధ్యప్రదేశ్(10), రాజస్థాన్(10), ఉత్తరాఖండ్‌(3)తోపాటు కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యూ(1)లో పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టు ఆయన తెలిపారు. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రుల కొడుకులకు చోటుదక్కింది. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కొడుకు వైభవ్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు, సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్‌తోపాటు అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కొడుకు, లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్‌కు అధిష్టానం మరోసారి ఎంపీ టికెట్ కేటాయించింది. నకుల్ నాథ్‌‌ను మరోసారి చింద్వారా(మధ్యప్రదేశ్) బరిలో దింపగా, జాలోర్(రాజస్థాన్) నుంచి వైభవ్ గెహ్లాట్, జోర్హాట్(అసోం) నుంచి గౌరవ్ గొగోయ్ ఎంపీగా పోటీ చేయనున్నారు. తాజాగా ప్రకటించిన 43 మంది అభ్యర్థుల్లో 10 మంది జనరల్ అభ్యర్థులు ఉండగా, 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీలు, 9మంది ఎస్టీలు, ఒక ముస్లిం అభ్యర్థి ఉన్నారు. గత ఎన్నికల్లో జోధ్‌పూర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన వైభవ్ గెహ్లాట్.. పలు సర్వేల నివేదిక ఆధారంగా ఈసారి జాలోర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక, గుజరాత్‌లో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను లోక్‌సభ అభ్యర్థులుగా ప్రకటించడం గమనార్హం. వావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జెనిబెన్ థాకూర్‌ను అధిష్టానం బానాస్కంత లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దించింది. ఇక్కడ బీజేపీ నుంచి రేఖాబెన్ చౌదరీ పోటీలో ఉన్నారు. వన్‌స్దా సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ పటేల్‌కు వల్సాద్ ఎంపీ టికెట్ కేటాయించింది. ఈ స్థానం ఎస్టీలకు రిజర్వ్ ఉండటంతో అనంత్‌ను బరిలోకి దించింది. కాగా, ఇప్పటికే 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ఈ నెల 8న విడుదల చేసిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News