సిటీ MP సెగ్మెంట్లపై ఓటింగ్ ఎఫెక్ట్.. నిర్ణయాత్మకంగా మారిన సెటిలర్ల ఓట్లు

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆ రాష్ట్ర ఓటర్లు అక్కడ ఓటు వేయడానికి లక్షలాది మంది ప్రయాణమయ్యారు.

Update: 2024-05-11 17:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆ రాష్ట్ర ఓటర్లు అక్కడ ఓటు వేయడానికి లక్షలాది మంది ప్రయాణమయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ళ పార్లమెంటు పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఆంధ్ర స్థానికత కలిగిన ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో సిటీలోని రోడ్లపై బస్సులు, సొంత వాహనాల రద్దీ పెరిగింది. ఈ నాలుగు ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో ఈసారి పోలింగ్ శాతంపై ఈ ప్రభావం గణనీయంగా పడనున్నది. ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు, కూకట్‌పల్లి, జేఎన్టీయూ, రామచంద్రాపురం, మియాపూర్, ఎస్సార్ నగర్, అమీర్‌పేట్, లక్డీకాపూల్, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి ఏపీలో ఓటు వేయడం కోసం వెళ్లిపోయారు. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో సిటీలో సగం ప్రాంతం ఖాళీ అయిన వాతావరణం నెలకొన్నది.

ఈ నాలుగు ఎంపీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 35-40 లక్షల మంది ఓటర్లు ఆంధ్రలోనూ ఓటు హక్కు ఉన్నవారేనని అంచనా. గత లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఈ నియోజకవర్గాల్లో సగటున 50% కూడా పోలింగ్ నమోదు కాలేదు. సమ్మర్ స్పెషల్ పేరుతో ద.మ. రైల్వే దాదాపు 55కు పైగా రైలు సర్వీసులను నడుపుతున్నది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీతో పాటు తెలంగాణ ఆర్టీసీ కూడా వేలాది సర్వీసుల్ని నడుపుడుతున్నది. కర్ణాటక ఆర్టీసీ సైతం ప్రత్యేకంగా ఈసారి ఏపీకి బస్సుల్ని తిప్పుతున్నది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు తదితర పట్టణాలకు ప్రైవేటు ట్రావెల్స్ సైతం వేలాది సర్వీసుల్ని నడుపుతున్నది.

రైళ్ళలో, ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవడంతో ఇప్పటికిప్పుడు టికెట్ దొరకడం గగనంగా మారింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు మూడు రెట్ల మేర టికెట్ ధరలను పెంచినా సీటు దొరకడం కష్టంగా మారింది. దీంతో కొందరు సొంత వాహనాల్లో మరికొందరు ట్రావెల్స్ కారులను బుక్ చేసుకుని వెళ్తున్నారు. ప్రైవేటు వాహనాలు సుమారు లక్ష వరకు ఈ రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్నట్లు తెలంగాణ రవాణా శాఖ అధికారుల అంచనా. ఈ రద్దీకి అనుగుణంగా కొన్ని విద్యా సంస్థల బస్సులు సైతం ప్రత్యేక పర్మిషన్‌తో ఏపీకి వెళ్తున్నాయి. వేలాది స్కూళ్ళ, కాలేజీల బస్సులు కూడా ఈసారి చార్టర్డ్ ట్రిప్ పేరుతో హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి.

ఓటర్లను దృష్టిలో పెట్టుకుని అక్కడి రాజకీయ పార్టీలు (తెలుగుదేశం, వైఎస్సార్సీపీ) కూడా ప్రత్యేకంగా బస్సుల్ని తిప్పుతున్నాయి. ఓటర్ స్లిప్‌కు అనుగుణంగా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఓటు వేయాలనుకునేవారిని గుర్తించి వారిపై ఎలాంటి ప్రయాణ చార్జీల భారం పడకుండా రానుపోను ఖర్చులను కూడా భరించేలా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ నివాసం ఉంటున్న ఏపీ ఓటర్లంతా సొంత ఊర్లకు వెళ్ళిపోవడంతో ఈ నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్ తగ్గిపోయి రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడనున్నది. వారి ఓట్లు ఇక్కడ నిర్ణయాత్మకం కావడంతో ఏ పార్టీకి చేటు తెస్తుందనే లెక్కలు మొదలయ్యాయి. అసలే పోలింగ్ శాతం తగ్గుతున్నదంటూ ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో లక్షలాది మంది ఏపీకి వెళ్ళిపోవడం గమనార్హం.

Tags:    

Similar News