అసెంబ్లీలో అట్టర్ ఫ్లాప్.. పార్లమెంటులో అయినా ప్లస్ అయ్యేనా?

పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి ఎంతో కీలకంగా మారాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు 400 ప్లస్ సీట్లను టార్గెట్‌గా పార్టీ పెట్టుకుంది.

Update: 2024-04-27 02:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి ఎంతో కీలకంగా మారాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు 400 ప్లస్ సీట్లను టార్గెట్‌గా పార్టీ పెట్టుకుంది. ఉత్తరాదిన సీట్లు బీజేపీకి సానుకూలంగా ఉన్న నేపథ్యంలో దక్షిణాదిపై కాషాయ పార్టీ ఫోకస్ పెట్టింది. సౌత్ స్టేట్స్‌లో ఎక్కువ మొత్తంలో సీట్లు గెలవగలిగితే వారనుకున్న టార్గెట్‌ను రీచ్ అవ్వొచ్చని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే దక్షిణాదికి గేట్ వేగా తెలంగాణను పార్టీ ఎంచుకుంది. కాగా ఎన్నికల ప్రచారంలో హోరెత్తించాలని చూస్తోంది. అందుకే అగ్ర నేతల పర్యటనలు తరచూ ఉండేలా కాషాయ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టూర్ పర్యటన కొనసాగింది. ఈ నెల 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 30న ప్రధాని మోడీ టూర్లు కొనసాగనున్నాయి.

ప్రణాళిక ఫలించేనా?

కమలం పార్టీ అగ్ర నాయకత్వం తెలంగాణకు రావడంతో నాయకులు, కార్యకర్తలు, శ్రేణుల్లో జోష్ పెరగనుంది. అంతేకాకుండా ప్రజలు, ఓటర్ల అటెన్షన్ మొత్తం బీజేపీ వైపు పడేలా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అన్ని వర్గాలను కమలం పార్టీ వైపు తిప్పుకునేలా పార్టీ ప్లాన్ చేస్తోంది. పార్టీ ప్రణాళిక ఎలా ఉన్నా ప్రజలు ఎంత వరకు ఆదరిస్తారనేది మాత్రం చూడాలి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కమలం పార్టీ అట్టహాసంగా ప్రచారం ప్రారంభించినా చివరకు ఆశించినన్ని స్థానాల్లో గెలుపు సాధించలేకపోయింది. కేవలం 8 స్థానాలకే పార్టీ పరిమితమైంది. అయితే గతంతో పోల్చుకుంటే ఇది మంచి విజయమే అని చెప్పుకోవడంతో పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అగ్రనేతల పర్యటన షెడ్యూల్ ఖరారు

ప్రధాని మోడీ తెలంగాణలో వరుస పర్యటనలు చేయనున్నారు. ఈనెల 30న జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో, మే 3న భువనగిరి, నల్లగొండ పార్లమెంట్ల పరిధిలో, 4న మహబూబ్ నగర్, చేవేళ్ల లోక్‌సభ పరిధిలో పబ్లిక్ మీటింగులు నిర్వహించనున్నారు. 30న బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా మోడీ ప్రచారం నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఎంప్లాయీస్‌తో భేటీ అయ్యే అవకాశముంది. మే 3న భువనగిరి, నల్లగొండ ఎంపీ సెగ్మెంట్లను కలుపుతూ ఒక సభ, 4న మహబూబ్‌నగర్, చేవెళ్ల పరిధిలో ఒక సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో అమిత్ షా సిద్దిపేటలో ప్రచారం నిర్వహించారు. కాగా 29న నడ్డా ఖమ్మం, మహబూబాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ల పరిధిలో ప్రచారం చేయనున్నారు. అదేరోజు సాయంత్రం ఉప్పల్‌లో నడ్డా.. రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సభలు, ర్యాలీలు ఎంత మేరకు ప్లస్ అవుతాయనే చర్చ కొనసాగుతోంది.

యువతపైనే భరోసా

పార్లమెంటు ఎన్నికలు పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ ఎన్నికలను కూడా అసెంబ్లీ ఎన్నికల్లా లైట్ తీసుకుంటారా? లేక సీరియస్‌గా తీసుకుని డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుస్తారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో కొనసాగుతోంది. మోడీ, షా, నడ్డా పర్యటనలతో శ్రేణుల్లో జోష్ సంగతి ఎలా ఉన్నా వాటిని ఓటు బ్యాంకుగా మార్చుకోవడం ఎలా అన్నది పార్టీకి సవాలుగా మారింది. యువత ఎలాగూ కమలం వైపే ఉన్నారని భావిస్తున్నారు. ఆ ఓటు బ్యాంకు పదిలంగా ఉన్నా.. ఇతర వర్గాల ఓట్లపై పార్టీ దృష్టిసారిస్తోంది. మరి అగ్ర నేతల ప్రచారాన్ని నమ్ముకున్న బీజేపీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుస్తుందనేది చూడాలి. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా అట్టర్ ఫ్లాప్ అవుతుందా? లేక అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటుతారా? అనేది చూడాలి.

Tags:    

Similar News