లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేది అప్పుడే.. ముహూర్తం ఖరారు!
లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూలు ఎప్పుడు వెలువడుతుందోనని అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. సెకండ్ వీక్‌లో ఎప్పుడైనా రిలీజ్ కావచ్చనే అంచనాతో ఉన్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూలు ఎప్పుడు వెలువడుతుందోనని అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. సెకండ్ వీక్‌లో ఎప్పుడైనా రిలీజ్ కావచ్చనే అంచనాతో ఉన్నాయి. కానీ ఈ నెల 11న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిషనర్లు, పలువురు అధికారులు అన్ని రాష్ట్రాల్లోని సీఈఓలు, సెంట్రల్ ఎలక్షన్ అబ్జర్వర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొన్ని సూచనలు, ఆదేశాలు ఇవ్వనున్నారు. దీంతో అప్పటివరకూ షెడ్యూలు విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు ఈ నెల 13న ప్రధాని మోడీ జమ్ము కశ్మీర్ పర్యటన ఉన్నందున అది ముగిసిన తర్వాతనే షెడ్యూలు విడుదలయ్యే అవకాశమున్నది. లోక్‌సభ ఎన్నికలతో పాటే జమ్ము కశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నది.
అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సెంట్రల్ ఎలక్షన్ అబ్జర్వర్లను ఖరారు చేసింది. ఆయా రాష్ట్రాల్లోని సీఈఓ (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్) ఆఫీసుల్లో పనిచేస్తున్న సీఈఓ, అదనపు సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు, ఎలక్షన్ కమిషన్ తరఫున పనిచేస్తున్నవారికి ‘బ్రీఫింగ్ మీటింగ్’ నిర్వహించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నెల 11న ఉదయం 9.00 గంటల నుంచే ఇది జరుగుతుందంటూ ఆయా రాష్ట్రాల తరపున హాజరుకావాల్సిన అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్) జాబితాను పంపింది. ఆ ప్రకారం తెలంగాణ నుంచి 2012-15 మధ్య బ్యాచ్‌లకు చెందిన 13 మంది ఐఏఎస్ అధికారులు హాజరు కావాల్సిందిగా సర్క్యులర్ పంపింది. దీనికి తోడు పలువురు ఐపీఎస్ అధికారుల లిస్టును కూడా పంపింది. వీరంతా ఫిజికల్‌గా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే మీటింగ్‌కు హాజరుకానున్నారు.
సీఈఓ, అదనపు సీఈఓ, డిప్యూటీ సీఈఓ లాంటి సీనియర్ బ్యూరోక్రాట్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సాయంత్రం వరకూ ఇది కొనసాగనున్నందున ఈసీ నుంచి సూచనలు ఇవ్వడంతో పాటు ఆయా రాష్ట్రాల్లోని కొన్ని ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా అదనపు జాగ్రత్తలపైనా స్పష్టత రానున్నది. ప్రధాని జమ్ము కశ్మీర్ టూర్ ముగిసిన తర్వాత మాత్రమే షెడ్యూలు విడుదల చేయడానికి అవకాశం ఉన్నట్లు ఈసీ వర్గాల సమాచారం.