రూ.2 కూడా చెల్లించలేకపోతున్నాం.. రైలు టిక్కెట్లు కొనడానికీ డబ్బుల్లేవ్.. కాంగ్రెస్ అగ్రనేతల తీవ్ర ఆవేదన

Update: 2024-03-21 18:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు గురువారం వీరంతా ఢిల్లీలో సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తమ పార్టీ ఖాతాలను స్తంభింపజేయడం ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన నేరపూరిత చర్య అని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు వీరు కుట్ర పన్నారని ఆరోపించారు. ‘‘మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నాయకులను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమాన ప్రయాణాలు పక్కనబెట్టండి.. కనీసం రైలు టికెట్లు కొనడానికీ మా వద్ద డబ్బుల్లేవ్‌. ఈ చర్యతో లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేయలేకపోతున్నాం’’ అని తెలిపారు. ‘‘దేశంలో మాకు 20శాతం మంది జనాభా ఓటు వేశారు. అలాంటి మేము బీజేపీ కుట్రల వల్ల ఇప్పుడు పార్టీ తరఫున కనీసం రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది’’ అని చెప్పారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం మౌనం వహించడాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తమ పార్టీ అకౌంట్లు ఫ్రీజ్ చేయడంపై ఎన్నికల సంఘం స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.

వ్యవస్థీకృత దాడి

సోనియా గాంధీ మాట్లాడుతూ, దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్థిక వ్యవస్థపై దాడి జరుగుతోందని ఆరోపించారు. ప్రజల నుంచి సేకరించిన నిధులను నిలిపివేస్తున్నారని, తమ ఖాతాల్లోని డబ్బులను బలవంతంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీయడానికి ప్రధాని మోడీ వ్యవస్థీకృత దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలక్టోరల్ బాండ్లతో రూ.వేల కోట్లు నింపుకున్నారు

ఎలక్టోరల్ బాండ్లతో వారి ఖాతాల్లో రూ.వేల కోట్లు నింపుకున్న బీజేపీ.. కాంగ్రెస్ అకౌంట్లను మాత్రం స్తంభింపజేసిందని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. కాగా, ‘రూ.210 కోట్ల పన్ను’ వ్యవహారంలో తమ బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్నుశాఖ స్తంభింపజేసిందని కాంగ్రెస్ ఫిబ్రవరిలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఐటీశాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


Tags:    

Similar News