ఎన్డీయే @ 373.. ఏబీపీ-సీవోటర్ సర్వేలో వెల్లడి.. బీఆర్ఎస్‌‌కు బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 స్థానాలకుగానూ టీడీపీ, జనసేన..

Update: 2024-04-16 17:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సర్వేలన్నీ బీజేపీవైపే మొగ్గుచూపుతున్నాయి. గెలుచుకునే సీట్లలో కొంతవరకు తేడా ఉంటుందే తప్ప భారీ మెజార్టీ మాత్రం బీజేపీదేనని ముక్తకంఠంతో చెబుతున్నాయి. మంగళవారం విడుదలైన ఏబీపీ-సీవోటర్ సర్వే సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం, దేశంలో మొత్తం 543 స్థానాలకుగానూ అధికార ఎన్డీయే కూటమి 373 నియోజకవర్గాలను కైవసం చేసుకోనుంది. అయితే, ఈసారి 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎన్డీయేకు.. ఆ కల నెరవేరకపోవచ్చని ఏబీపీ-సీవోటర్ సర్వే అంచనా వేసింది. మరోవైపు, ఈసారైనా గెలవాలని ఆశతో ఉన్న కాంగ్రెస్‌కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చని పేర్కొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 155 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ తగలనున్నట్టు సర్వే ఫలితాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలుండగా, అధికార కాంగ్రెస్‌ 10 స్థానాల్లో గెలవనుందని వెల్లడైంది. బీజేపీ 5 సీట్లను కైవసం చేసుకోనుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కేవలం ఒక్క సీటుకే పరిమితం కానున్నట్టు పేర్కొంది. మరో సీటును ఏఐఎంఐఎం గెలుచుకోనున్నట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, మొత్తం 25 స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి 20 స్థానాలు విజయం సాధించనుందని, మిగిలిన 5 సీట్లలో అధికార వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలో తేలింది.



Similar News