బిడ్డను కాపాడుకునేందుకు బీజేపీతో కేసీఆర్ లాలూచీ.. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ది పదవీ వ్యామోహం అని, ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడించినా ఇంకా బుద్ధి రాలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Update: 2024-05-11 14:07 GMT

దిశ బ్యూరో, ఖమ్మం: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ది పదవీ వ్యామోహం అని, ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడించినా ఇంకా బుద్ధి రాలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలూ ఒక తాను ముక్కలేనని విమర్శించారు. ఎన్నికల ప్రచార చివరి రోజైన శనివారం కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాo రెడ్డి, మిత్రపక్ష పార్టీల నాయకులతో కలిసి కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్వాకoతోనే నేడు రాష్ట్రంలో నీటి కష్టాలు మొదలయ్యాయని అన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడతారని చెప్పారు. ఆయన హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ఆ ప్రభుత్వ కాలంలోనే కుంగిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పగటిపూటేమో బీజేపీపై విమర్శలు చేస్తూ.. రాత్రి అయ్యాక ఆ పార్టీ పెద్దలతో కూర్చొని.. మంతనాలు జరుపుతారని తెలిపారు. నిరుద్యోగుల బాధ, రైతుల కష్టాలు, మహిళాల ఆవేదన ఎప్పుడూ పట్టించుకోలేదని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయి, సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేక ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడని అన్నారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కర్రుని ఎర్రగా కాల్చి వాత పెట్టడం ఖాయమని విమర్శించారు.

పదివేల పుస్తకాలు చదివిండంట.. అసెంబ్లీ కేమో రాడంట

రూ. 1,000 కోట్లు ఖర్చుపెట్టి.. జాతీయ పార్టీ కోసం దుబారా చేశాడని, ఇక్కడి ప్రజల సొమ్మును పట్టుకెళ్ళి పొరుగు రాష్ట్రాలలో ప్రచార ఆర్భాటంతో వృథా చేశాడని మంత్రి పొంగులేటి అన్నారు.పదివేల పుస్తకాలు చదివినా.. అని గొప్పలు చెప్పుకునే ఓ మేధావి.. అసెంబ్లీకి ఎందుకు రావు అని ప్రశ్నించారు. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినా.. తుంటి విరిగిందని సాకు చెబుతూ హైదరాబాద్ లో తన ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అసెంబ్లీకి రాలేదు కానీ.. బస్సు యాత్ర పేరిట కర్ర పట్టుకుని .. జిల్లాలు దాటి ఎలా తిరుగుతున్నావని విమర్శించారు. నల్లగొండ, ఖమ్మం మీటింగ్ లకు రావడానికి.. తుంటి నొప్పి రాలేదా దొరా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తానంటూ.. వాగారని, ప్రజా ప్రభుత్వాన్ని టచ్ కూడా చేయలేరని పొంగులేటి అన్నారు.

కాళేశ్వరం పై నోరు మెదపడు..

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే ఎవరూ కట్టలేరని కేసీఆర్ గొప్పలు చెప్పాడని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీటలు వారి కుంగిపోయిందని, ఆ ప్రాజెక్టులో నీరు కిందికి లీక్ అయిపోతుంటే.. కనీసo స్పందించలేదని మంత్రి పొంగలేటి అన్నారు. లక్షలాది మంది రైతుల పంటలు ఎండిపోతున్నా, వారి తప్పులకు ప్రజలకు ఎక్కడ క్షమాపణ చెప్పాల్సి వస్తుందోనని, కాంగ్రెస్ వచ్చింది తాగునీటి కష్టాలు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను వృథా చేయడమే కాదు.. కృష్ణా జలాలను పొరుగు రాష్ట్రం ఆంధ్రాకు మళ్ళించి.. మన రైతులను గోసపెట్టాడని తెలిపారు. ఆ నిందను కప్పిపుచ్చుకొని.. కాంగ్రెస్ ప్రభుత్వం పై నెడుతున్నాడని అగ్రహం వ్యక్తం చేశారు. బస్సు యాత్రలో కాళేశ్వరం.. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ కి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా దానిని పరిశీలించే ధైర్యం చేయలేదని విమర్శించారు.

జైల్లో ఉన్న బిడ్డను, దోచుకున్న ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం

ఖమ్మం పర్యటనకు వచ్చి నామాను గెలిపిస్తే కేంద్రమంత్రిని చేస్తానని అన్నాడని, బీజేపీతో వారి బంధం బయట పెట్టుకున్నాడని మంత్రి పొంగులేటి తెలిపారు. నామాకు ఇక్కడ డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. మీ జాతీయ పార్టీ ఏమైంది చంద్రశేఖర రావూ..? అంటూ ప్రశ్నించారు. 540 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టే దమ్ము ఆయనకు లేదని, తమ ఇండియా కూటమిలో కనీసం వేలు కూడా పెట్టనివ్వమని హెచ్చరించారు. ఢిల్లీ లికర్ స్కాం లో ఇరుక్కొని జైల్లో ఉన్న తన బిడ్డను కాపాడుకునేందుకు..

ధరణి ఆసరాగా..హైదరాబాద్ చుట్టుపక్కల దోచుకున్న వందల ఎకరాలు, ప్రాజెక్టుల ద్వారా దాచుకున్న వందల కోట్లను కాపాడుకునేందుకు..బీజేపీ పెద్దలతో రాత్రిపూట చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని విమర్శించారు.

హిందువుల మంగళసూత్రాలు తెంచి ముస్లింలకు ఇస్తారని దుష్ప్రచారం..

ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ఈసారి గనక మోదీ పొరపాటున వస్తే.. రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేస్తారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బీజేపీ పెద్దలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. హిందువుల తాళిబొట్లు తెంచి ముస్లిం, క్రైస్తవ మహిళలకు ఇస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాముల వారి పేరిట కూడా.. రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.బీజేపీని ప్రజలు నమ్మొద్దని, త్యాగాల కుటుంబమైన రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని అన్నారు. బీజేపీ లాగా మనకు మత రాజకీయాలు తెలియదని, మన మతం కాంగ్రెస్ మతం అని, ప్రజలందరి సంక్షేమం కోరే సెక్యులర్ మతం అని పొంగులేటి అన్నారు. ఇండియా కూటమి ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.. రాహుల్ తల్చుకుంటే గతంలోని రెండుసార్లు ప్రధాని అయ్యే వారిని, ఈసారి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ ని ప్రధాని చేసుకుందామని, ఇక్కడ మన రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకుందాం..

ఈ మొదటి సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసుకుందామని, ఎన్నికల కోడ్ ముగిశాక తాను, మంత్రులు స్వయంగా భూమి పూజ కార్యక్రమాలకు హాజరవుతారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఐదు సంవత్సరాల పదవీకాలంలో ఏ పల్లెలో కూడా ఇల్లు, ఇంటి స్థలం లేని పేదవారు లేకుండా కాంగ్రెస్ పరిపాలన ఉంటుందని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో.. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, టీడీపీ నేత కూరపాటి వెంకటేశ్వర్లు, సీపీఎం నాయకులు యర్రా శ్రీకాంత్, సీపీఐ నాయకులు జానీ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News