పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. ఒక్కొక్కరుగా పార్టీ వీడాలని కీలక నేతల ప్లాన్..!
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీజేపీలో ఒకవైపు చేరికలు జరుగుతుండగా మరోవైపు వీడే నేతలు సైతం క్యూ కడుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీజేపీలో ఒకవైపు చేరికలు జరుగుతుండగా మరోవైపు వీడే నేతలు సైతం క్యూ కడుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం పార్టీకి గుడ్ బై చెప్పారు. హస్తం గూటికి చేరారు. కాగా అదే దారిలో మరికొందరు నేతలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమయానుసారంగా ఒక్కొక్కరు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కేంద్రంలో 400 ప్లస్ స్థానాల్లో, తెలంగాణలో డజను స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీని నేతలు వీడటం మైనస్ కానుంది. ఇది తెలంగాణలో పార్టీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కూన తర్వాత మరికొందరు నేతలు పార్టీ వీడుతారని ప్రచారం జరుగుతుండటంతో రాష్ట్ర నాయకత్వంలో ఆందోళన మొదలైంది.
పార్టీ మల్లగుల్లాలు
ఇప్పటికే కూన శ్రీశైలం గౌడ్ సొంత గూటికి చేరడంతో ఆ తర్వాత వెళ్లే నేతలెవరనే అంశంపై పార్టీ దృష్టిసారిస్తోంది. వెళ్లే వారిని అడ్డుకోవడంపై ఫోకస్ పెట్టనుంది. ఉన్న వారిని కాపాడుకునేందుకు ఏం చేయాలా? అని యోచిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను అధిగమించడంపై రాష్ట్ర నాయకత్వం పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ వీడే వారిని వీలైనంత త్వరగా గుర్తించాలని పార్టీ భావిస్తోంది. వారికి గల ఇబ్బందులు ఏంటో తెలుసుకుని వాటిని పరిష్కరించాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ఘటనలు జరగడంతో పార్టీ ప్రతిష్ట దిగజారింది. ఆ సీన్ ఈ ఎన్నికల్లో రిపీట్ కాకుండా చూడటంపై రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది.
కాపాడుకునేందుకు వ్యూహం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సమస్యలు పార్లమెంటు ఎన్నికల్లో జరగకూడదని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా నష్ట నివారణపై దృష్టిసారిస్తోంది. పార్టీలో ఉన్న నేతలను కాపాడుకోవడంపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పాలనుకున్న నేతలు పార్టీకి గట్టి ఝలక్ ఇవ్వాలని చూస్తున్నట్లు టాక్. సమయం చూసి దెబ్బకొట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. త్వరలోనే రాష్ట్రంలో ప్రచారానికి జాతీయస్థాయి నేతలు రానున్నారు. వచ్చే నెలలో మోడీ షెడ్యూల్ కూడా ఉండే అవకాశాలున్నాయి. ఈ సమయంలో నేతలు వీడటం రాష్ట్ర నాయకత్వానికి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఉన్న నేతలను కాపాడుకునేందుకు పార్టీ ఎలాంటి వ్యూహం అమలు చేయనుందనేది చూడాలి.