అన్ని సర్వేల్లో నాకే హైయెస్ట్ మార్కులు: మల్లు రవి
నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి తానే బరిలో ఉంటానని, అందులో ఎలాంటి అనుమానం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి తానే బరిలో ఉంటానని, అందులో ఎలాంటి అనుమానం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి పేర్కొన్నారు. పార్టీతో పాటు హైకమాండ్, ఇతర ప్రైవేట్ సర్వేలన్నింటిలోనూ తనకే హైయెస్ట్ మార్కులు వచ్చాయని మల్లు గుర్తు చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...పార్టీ తనకు తప్పకుండా టిక్కెట్ ఇస్తుందన్నారు. పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమాను వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా తనకు సహకరిస్తారని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా ఎమ్మెల్యేల గెలుపునకు తాను కృషి చేశానని చెప్పారు. అతి త్వరలోనే టిక్కెట్ల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించేందుకు పీఎంతో ముఖ్యమంత్రి కలవడంలో తప్పేమున్నదని వివరించారు.ఫెడరల్ వ్యవస్థ స్పూర్తితో పీఎం అన్ని రాష్ట్రాలకు పెద్దన్న లాగా పనిచేయాలని సీఎం రేవంత్ చెప్పడంలో తప్పేమీ లేదన్నారు. కానీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి , సీఎం అలా ఎందుకు మాట్లాడారో? తెలియదు? అయన్నే అడగండి అని చెప్పడం విచిత్రంగాఉన్నదన్నారు. రాష్ట్రాల్లో ఏ పార్టీ పవర్ లో ఉన్నప్పటికీ , కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజ్యాంగం ప్రకారం అభివృద్ధిలో సహకరించాల్సిందేనని చెప్పారు. అన్ని రాష్ట్రాల సీఎంలు అధికారిక కార్యక్రమాల్లో పీఎంతో భాగస్వామ్యం అవ్వొచ్చని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డికి ఆ మాత్రం అర్ధం కాకపోతే తానేమీ చెప్పలేనని విమర్శించారు. ఇండియా కూటమిలో బీఎస్పీ లేనందునే, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో చేతులు కలిపి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
గత సీఎం ప్రధాని మంత్రి ని గౌరవించేందుకు ఇష్టపడలేదని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు అని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉండి కూడా పీఎం అధికారిక ప్రోగ్రామ్ లకు వస్తే కేసీఆర్ హాజరు కాకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి మొండి వైఖరికి వెళ్లాలని భావించడం లేదని, రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తూనే, పార్టీని కాపాడుకుంటామన్నారు. ఇక ఆరు గ్యారంటీలను సకాలంలోనే అమలు చేస్తామన్నారు. ఇప్పటికే 18.50 లక్షల మంది మహిళలు ఉచితంగా జర్నీ చేశారన్నారు. రాజీవ్ ఆరోగ్య పేరిట కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా రూ. 10 లక్షల తో వైద్యం పొందుతున్నారన్నారు. త్వరలోనే రూ.500 గ్యాస్ సిలిండర్, ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ ను అమలకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. త్వరలో రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే స్వతంత్రం,స్వేచ్ఛ లభించిందన్నారు. ప్రగతిభవన్ , సచివాలయంలో ప్రతి రోజు వేల మంది ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు సులువుగా వస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిపుణుల సలహా మేరకు ముందుకు సాగుతామన్నారు. కుండిపోయిన డ్యామ్ పై కూడా పూర్తి స్పష్టతతో నిర్ణయాలు ఉంటాయన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా తప్పిదాలు చేయకూడదనే సంకల్పంతో తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందన్నారు.
ఖర్గే, కేసీతో భేటీ...
ఇక ఢిల్లీలో ఉన్న మల్లు రవి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లను ప్రత్యేకంగా కలసి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. నాగర్ కర్నూల్ ఎంపీ టిక్కెట్ తనకే ఇవ్వాలని కోరారు. అక్కడి ప్రజల అభిప్రాయాలు, వివిధ సర్వేల రిపోర్టులను హైకమాండ్ ముందు ఉంచినట్లు తెలిసింది. ఏఐసీసీ కూడా సానుకూలంగా స్పందించినట్లు మల్లు రవి తెలిపారు.