బీఆర్ఎస్‌కు 10 ఎంపీ స్థానాలు ఇవ్వండి.. మా సత్తా ఏంటో చూపిస్తాం: KTR

బీజేపీ నేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాగర్‌కర్నూలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

Update: 2024-04-23 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాగర్‌కర్నూలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. దేవుడు అందరివాడు అని.. కేవలం బీజేపీకి మాత్రమే పరిమితం కాదని అన్నారు. దేవుడి అక్షింతలతోనూ బీజేపీ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదల అభివృద్ధికి ఏం చేసిందని ప్రశ్నించారు. చేసిన అభివృద్ధి చెప్పలేక జై శ్రీరాం నినాదాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి.. కష్టాలు రెట్టింపు చేశారని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ప్రజలు అధికారం ఇస్తే 100 రోజుల్లోనే చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను 10 స్థానాల్లో గెలిపించండి.. దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చేస్తామని అన్నారు. గతంలో కన్నా అత్యధిక స్థానాలు గెలుపొందుతామని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 నుంచి 10 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయనే విషయాన్ని గుర్తుచేశారు. ప్రజల పక్షాన కొట్లాడుతూ బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో నమ్మకం పోయిందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడుదామని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News