రూ.5 వేల కోట్లతో పాతబస్తీ రూపురేఖలు మారుస్తా: MP అభ్యర్థి
తనను ఎంపీగా గెలిపిస్తే రూ.5 వేల కోట్ల నిధులు తీసుకొచ్చి పాతబస్తీని అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి వలీవుల్లా సమీర్ ప్రకటించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తనను ఎంపీగా గెలిపిస్తే రూ.5 వేల కోట్ల నిధులు తీసుకొచ్చి పాతబస్తీని అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి వలీవుల్లా సమీర్ ప్రకటించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు పాతబస్తీకి ఎంఐఎం చేసింది ఏమీ లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పవర్‌లోకి రాగానే స్పెషల్ ఫండ్స్ మంజూరు చేస్తామన్నారు. దీంతో హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపొచ్చన్నారు. సమగ్ర ప్రణాళికను తయారు చేసి డెవలప్ చేస్తామన్నారు.
చారిత్రాత్మకమైనప్పటికీ నిర్లక్ష్యానికి గురైన హైదరాబాద్ పాతబస్తీని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామన్నారు. స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తూ, కొత్త వ్యాపారాలను ఆకర్షించేందుకు కృషి చేస్తానన్నారు. వేలాది మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం పాతబస్తీలో నిరుద్యోగిత రేటు 21 శాతం ఉన్నదని, 20–24 ఏళ్ల వయస్కుల్లో 45 శాతం ఉన్నదన్నారు. పాతబస్తీకి మెట్రోరైల్‌తో పాటు మరిన్ని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.