కవిత అరెస్టుపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
దిశ, సంగారెడ్డి బ్యూరో : రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ మీద గులాబీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మంచోడు అయితే దుబ్బాకలో గెలవాలి కదా.. ఆయన పనితీరు బాగోలేదని 54 వేల ఓట్లతో ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని విమర్శలు గుప్పించారు. చింతా ప్రభాకర్‌ను గెలిపించినట్లుగా, వెంకట్రామిరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంతో మంచి మనిషని, పేద పిల్లల కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.
కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ అని మాట తప్పిందని, రైతు బంధు, బోనస్ అని మాట తప్పిందని మండిపడ్డారు. పింఛన్లు కూడా ఇవ్వలేదని, 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని హరీశ్ రావు ప్రశ్నించారు. వంద రోజుల పాలన చూసి ఓటు వేయాలని అంటున్నారని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే హామీలు అమలు చేయకున్నా ఒప్పుకున్నట్టు అవుతుందని ప్రజలకు వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని, చోటే భాయ్ రేవంత్ రెడ్డి బడే భాయ్ మోడీ ఆశీర్వాదం తీసుకున్నాడని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ముస్లింలను క్యాబినెట్ మంత్రిగా ఏనాడూ తీసుకోలేదని ఆరోపించారు. కానీ కేసీఆర్ ముస్లింలను ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రిని చేశారని గుర్తు చేశారు. బడ్జెట్‌లోనూ ముస్లింలకు నిధులు కోత విధించారని, రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
ఒప్పందం పెట్టుకుంటే కవిత అరెస్టు అయ్యేవారా...?
నచ్చినోళ్లు జేబులో, నచ్చ్చనోళ్లు జైల్లో ఉండాలే అన్నట్టు ఉంది బీజేపీ వైఖరని, వాళ్లతో ఒప్పందం పెట్టుకోలేదనే ఈరోజు కవితను జైలుకు పంపారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కేజ్రీవాల్‌పై అక్రమ కేసులు పెట్టి కేసులు అరెస్ట్ చేశారని, ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఎప్పుడూ బీజేపీతో కలిసేది లేదన్నారు. మాది సెక్యులర్ పార్టీ అని హరీష్ రావు స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసి మోసం చేశాయని దుయ్యబట్టారు.
154 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్కటి మనకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలని హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే సునీత, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.