రాముడిని అవమానించిన కాంగ్రెస్: ప్రధాని మోడీ చెప్పిన కారణం ఇదే..

Update: 2024-04-09 19:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా కాంగ్రెస్, రాముడిని అవమానించిందని ప్రధాని మోడీ ఆరోపించారు. అంతేకాకుండా, ఆలయ నిర్మాణం జరగకుండా ఎన్నో అడ్డంకుల్ని సృష్టించిందని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మంగళవారం యూపీలోని పిలిభిత్, మహారాష్ట్రలోని బాలఘాట్, తమిళనాడులోని చెన్నయ్‌లో పర్యటించారు. ఆయా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘‘సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్‌ల ఇండియా కూటమి భారత వారసత్వాన్ని పట్టించుకోదు. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, దేశ ప్రజలు ప్రతి పైసాను విరాళంగా ఇచ్చి సుందరమైన ఆలయాన్ని నిర్మించారు. కాంగ్రెస్ చేసిన పాపాలను క్షమించి, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించారు. కానీ, ఆ ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించి, రాముడిని అవమానించింది. రాముడిని పూజించినవారినీ ఆ పార్టీ బహిష్కరించింది. దీన్ని బట్టి కాంగ్రెస్ ఎలాంటి పార్టీయో అర్థం చేసుకోవచ్చు’’ అని విమర్శించారు. కాంగ్రెస్, ఎస్పీలు బుజ్జగింపుల బురదలో మునిగిపోయాయని, బుజ్జగింపుల ఒత్తిళ్లతోనే ఇరు పార్టీలూ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ, ఇండియా కూటమి నేతలు అవినీతిపరులను రక్షించేందుకు పనిచేస్తున్నారని, దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్న తనను మాత్రం బెదిరిస్తున్నారని తెలిపారు. అయితే, తాను మహాకాల్ దేవుడి భక్తుడినని, ఎవరి బెదిరింపులకూ భయపడబోనని చెప్పారు. తనను ఆపడానికి వచ్చానని చెప్పుకుంటున్న ఇండియా కూటమిలోని పార్టీలు.. ముందుగా కూటమిలోని పార్టీల మధ్య పోట్లాటలను ఆపాలని ఎద్దేవా చేశారు. వాస్తవానికి వారు మోడీని ఆపాలనుకోవడం లేదని, ఈ దేశ అభివృద్ధిని ఆపాలనుకుంటున్నారని అన్నారు. అవినీతిని అంతం చేయాలని తానంటే, అవినీతిని కాపాడాలని ప్రతిపక్షాలు అంటున్నాయని చెప్పారు. దేశాభివృద్ధి కోసం బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం సాయంత్రం 7గంటలకు చెన్నయ్ చేరుకున్న మోడీ.. మెగా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది బీజేపీ మద్దతుదారులు.. దారివెంట ప్రధాని మోడీపై పూలవర్షం కురిపించారు. ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. మోడీ వెంట తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఉన్నారు.



Similar News