ఖరారు కాని హైదరాబాద్ కాంగ్రెస్ MP అభ్యర్థి.. సస్పెన్స్‌కు తెరదించేదెప్పుడు..?

లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీచేసే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.

Update: 2024-04-20 02:26 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీచేసే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను సమర్పించేందుకు గడువు ఉన్నప్పటికీ చివరి నిమిషం వరకు ఎదురుచూడాల్సి రావడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురౌతున్నారు. ఓ వైపు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసేది ఎవరో తెలియకపోవడంతో ఎంఐఎంకు వదిలేశారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న ఈ సీటును ఈ పర్యాయం ఎలాగైన లాగేసుకుని 40 యేండ్ల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాలని ఇతర పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించాయి. బీజేపీ నుంచి ప్రముఖ సంఘ సేవకురాలు, విరించి హాస్పిటల్ చైర్‌పర్సన్ మాధవీలత బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎంఐఎం నుంచి అసదుద్ధీన్ ఒవైసీ నామినేషన్ సైతం దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనేది నేటి వరకు కూడా స్పష్టత రాకపోవడం, పూటకో పేరు వినిపిస్తుండడం పార్టీ అభిమానులను అయోమయానికి గురిచేస్తోంది.

ప్రచారం ఎలా..?

పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. 26న స్క్రూటినీ, 29న ఉపసంహరణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. మే 13న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు అనంతరం ప్రచారానికి రెండు వారాల గడువు కూడా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆందోళనకు గురౌతోంది. ఇప్పటికే క్రిందిస్థాయి కార్యకర్తలు ఇతరపార్టీల వైపు చూస్తుండడం జరుగుతోందని, వీలైనంత త్వరగా పార్టీ అభ్యర్థిని ప్రకటించాలని ఏఐసీసీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు.

స్నేహపూర్వక పోటీ ఉంటుందా..?

హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య స్నేహపూర్వక పోటీనే ఉంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎంఐఎం ఇదే తరహాలో మెలిగింది. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి కాంగ్రెస్ విషయంలోనూ జరుగుతోందనే టాక్ వినబడుతోంది. ఎంఐఎంతో దోస్తానా పలు రకాలుగా లాభిస్తుందనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. పాతబస్తీలో ఎంఐఎంతో చేసే స్నేహం ప్రభావం మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్నఇతర నియోజకవర్గాలపై చూపుతుందని, మైనార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు పోలౌతాయని, ఇది తమకు ఎంపీ సీట్లు పెంచే అవకాశం ఉండగా మరోవైపు బీఆర్ఎస్‌తో ఎంఐఎం దోస్తానా కట్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తం మీద హైదరాబాద్ పార్లమెంట్ సీటు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించుతుందా? లేక ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ కొనసాగిస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

సస్పెన్స్‌కు తెరదించేదెప్పుడు..

ఓ వైపు నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తుండగా హైదరాబాద్ పార్లమెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో నెలకొన్న సస్పెన్స్‌కు తెర ఎప్పుడు దించుతారనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఎంతో మంది పోటీపడుతున్నారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు వలివుల్లా, అలీ మస్కథి బరిలో ఉంటారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే పలు రకాల కారణాలతో అలీ మస్కతి ఇప్పుడు పోటీకి నిరాకరిస్తున్నారని ప్రచారం సాగుతోంది. వీరేకాకుండా న్యాయవాది శాహనాజ్, మాజీ క్రికెటర్ అజారుద్ధీన్, ఫెరోజ్ ఖాన్, టెన్నిస్ స్టార్ సానిమా మీర్జా పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ ఎంఐఎంకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దించకపోతే డిపాజిట్ కూడా గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, కనీస పోటీ ఇవ్వకుండా అభ్యర్థి ఓటమిపాలైతే దాని ప్రభావం పార్టీపై చూపే అవకాశం ఉందని, ఇందుకోసం ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ వెతుకులాట ప్రారంభించిందని, అందుకే అభ్యర్థి ప్రకటనలో జాప్యం జరుగుతోందనే టాక్ వినబడుతోంది.

Tags:    

Similar News