తక్కువ టైంలోనే రేవంత్ ప్రజల ఆదరణ కోల్పోయారు: ఈటల
రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిస్తే నిధులు రావని రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని, అసలు రేవంత్ రెడ్డికి కొంచెమైనా జ్ఞానం ఉందా? అని ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిస్తే నిధులు రావని రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని, అసలు రేవంత్ రెడ్డికి కొంచెమైనా జ్ఞానం ఉందా? అని ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేనప్పటికీ రాష్ట్రాన్ని కేంద్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పంథాలో నడిపిందని ఈటల గుర్తుచేశారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రకరకాల మార్ఫింగ్ వీడియోలు చేసి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని విరుచుకుపడ్డారు. వారు ఏం చేసినా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. అతి తక్కువ సమయంలో ప్రజల ఆదరణ కోల్పోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయన్నారు. మహిళలకు రూ.2500 ఇస్తామన్నారని, స్కూటీలు, పెన్షన్లు ఎక్కడని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్టేనని ఈటల విమర్శనాస్త్రాలు సంధించారు.