మోడీతో తలపడేందుకు సిద్ధమైన కాంగ్రెస్ కీలక నేత.. 46 మందితో నాలుగో జాబితా విడుదల

రెండుసార్లు మోడీపై పోటీ చేయగా, రెండుసార్లు కూడా ఘోర ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ మరోసారి మోడీతో తలపడేందుకు సిద్ధమయ్యారు.

Update: 2024-03-23 18:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 46 మందితో కూడిన నాలుగో జాబితాను శనివారం రాత్రి విడుదల చేసింది. ఇందులో అసోం, అండమాన్ నికోబర్ దీవులు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఒక్కో స్థానానికి అభ్యర్థిని ప్రకటించగా, జమ్మూ కశ్మీర్ నుంచి ఇద్దరికి సీట్లు కేటాయించింది. వీటితోపాటు మధ్యప్రదేశ్(12), మహారాష్ట్ర(4), మణిపూర్(2), మిజోరం(1), రాజస్థాన్(3), తమిళనాడు(7), ఉత్తర ప్రదేశ్(11), బెంగాల్(1) రాష్ట్రాల నుంచి పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌ను మరోసారి ప్రధాని మోడీపై పోటీకి దించింది. వారణాసి నియోజకవర్గం నుంచి అజయ్ రాయ్ ఇప్పటివరకు రెండుసార్లు మోడీపై పోటీ చేయగా, రెండుసార్లు కూడా ఘోర ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ మరోసారి మోడీతో తలపడేందుకు సిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌ను రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అధిష్టానం బరిలోకి దింపుతోంది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కొడుకు కార్తి చిదంబరానికి తమిళనాడులోని శివగంగ స్థానాన్ని కేటాయించింది. తమిళనాడు సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ విరుధునగర్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ స్థానంలో బీజేపీ తరఫున రాధికా శరత్ కుమార్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగానూ కాంగ్రెస్ ఇప్పటివరకు 185 అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 39 మంది అభ్యర్థులను ప్రకటించగా, 43 మందితో రెండో జాబితా, 57 మందితో మూడో జాబితా, తాజాగా 46 మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది.


Tags:    

Similar News