తమ్ముడు కొండల్ రెడ్డి పోటీపై CM రేవంత్ రెడ్డి క్లారిటీ
పార్లమెంట్ ఎన్నికల బరిలో తన సోదరుడు కొండల్ రెడ్డి పోటీ చేయబోతున్నారన్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల బరిలో తన సోదరుడు కొండల్ రెడ్డి పోటీ చేయబోతున్నారన్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా కుటుంబం నుంచి ఎవరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ అభ్యర్థులను అధిష్టానమే ఫైనల్ చేస్తుందని చెప్పారు. గెలుపు గుర్రాల జాబితాను మాత్రమే తాము అధిష్టానికి పంపుతామని.. ఫైనల్ చేసేది హైకమాండేనని అన్నారు.
కేసీఆర్‌లా తాను ప్రధాని మోడీ చెవిలో గుసగుసలు చెప్పలేదని తెలిపారు. బీజేపీ నేతలు స్వయంగా మోడీనే తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతోనే టికెట్ల ప్రకటన జరుగుతోందని వెల్లడించారు. ఎన్ని డ్రామాలు చేసినా బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవడం కష్టమే అన్నారు. ఆల్రేడీ మునిగిపోయిన నావ అని ఎద్దేవా చేశారు. ఈ పార్లమెట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని తేల్చి చెప్పారు. కాగా, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి మల్కాజ్‌గిరి నుంచి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటాడని వార్తలు విస్తృతమయ్యాయి. ఈ క్రమంలోనే చిట్‌చాట్‌లో మీడియా ప్రతినిధులు ప్రశ్నలు సంధించగా సీఎం క్లారిటీ ఇచ్చారు.