లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్లీనరీపై BRS కీలక నిర్ణయం
ప్లీనరీకి బీఆర్ఎస్ పార్టీ మంగళం పాడినట్లయింది. గతేడాది కూడా ప్లీనరీ నిర్వహించకుండానే కేవలం భవన్‌లోనే పార్టీ జెండాను ఎగురవేసి జనరల్ బాడీ సమావేశంతో ముగించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్లీనరీకి బీఆర్ఎస్ పార్టీ మంగళం పాడినట్లయింది. గతేడాది కూడా ప్లీనరీ నిర్వహించకుండానే కేవలం భవన్‌లోనే పార్టీ జెండాను ఎగురవేసి జనరల్ బాడీ సమావేశంతో ముగించారు. ఈ ఏడాది జెండావిష్కరణతోనే మమా అనిపిస్తుంది. పార్టీ నేతలంతా జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని పార్టీ అధిష్టానం సూచించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలు, కేడర్ అంతా ప్రచారంలో బిజీగా ఉండటంతోనే ఫ్లీనరీని నిర్వహించడం లేదని పార్టీ నేతులు పేర్కొంటున్నారు.
ఎన్నికల నేపథ్యంలో
బీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్లీనరీ నిర్వహిస్తుంది. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఉండటం, పార్టీ నాయకులు, కేడర్ అంతా పార్టీ ప్రచారంలో నిమగ్నమై ఉండటంతో ప్లీనరీ నిర్వహించడం లేదని సమాచారం. ప్లీనరీ నిర్వహిస్తే మూడునాలుగు రోజులకు పైగా సమయం వృథా అవుతుందని భావించినట్లు తెలిసింది. మరో పదహారు రోజులు మాత్రమే లోక్‌సభ పోలింగ్‌కు సమయం ఉంది. ఈ సమయంలో పార్టీ కేడర్ అంతా జనం మధ్యలో ఉంటేనే పార్టీకి ప్లస్ అవుతుందనే నిర్ణయానికి వచ్చే ప్లీనరీపై వెనక్కి తగ్గినట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లోనే జెండా ఎగురవేయాలని పార్టీ అధిష్టానం నేతలకు పిలుపు నిచ్చింది.
శ్రేణుల్లో జోష్ నింపడంలో విఫలం
గతేడాది బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అయినప్పటికీ ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని భావించిన అధిష్టానం ప్లీనరీ నిర్వహించలేదు. కేవలం పార్టీ జెండాను ఆవిష్కరించి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు, పార్టీ ఆర్థిక కార్యక్రమాలపైనా చర్చించి ముగించారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడంలో విఫలమయ్యారనే చర్చ సైతం కొనసాగింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో కేవలం పార్టీ జెండా ఆవిష్కరణతోనే ముగించనుంది. పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎన్నికల ప్రచారంలో బిజీగాఉన్నారు. రోడ్డుషోలు, సమావేశాలతో ప్రజలను మోటివేషన్ చేస్తున్నారు. దీంతోనే ప్లీనరీని వచ్చే ఏడాది ఘనంగా నిర్వహించుకుందామని భావించి ఇప్పుడు వాయిదా వేసినట్లు సమాచారం.
కేడర్‌లో నైరాశ్యం
పార్టీ ప్లీనరీ నిర్వహిస్తే పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై కేడర్‌కు స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. వారిని పార్టీ కార్యక్రమాల్లో బిజీ చేసే అవకాశం ఉంటుంది. ఏ అంశాలపై పార్టీ భవిష్యత్ కార్యాచరణ చేపడ్తుంది... రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఏ మేరకు పోరాటం చేస్తుందనే అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలను స్పష్టంగా ప్రజలకు ప్లీనరీ వేదికగా చెప్పే అవకాశం ఉంది. కానీ పార్టీ జెండావిష్కరణతో ముగించాలని భావిస్తుండటంతో నాయకుల్లో, కేడర్‌లో కొంత నైరాశ్యం నెలకొంది.
తెలంగాణ భవన్‌లో జెండావిష్కరించనున్న కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని తెలంగాణ భవన్‌లో శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకే జెండాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఆవిష్కరించనున్నారు. అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో జెండాను ఎగురవేయాలని పార్టీ నాయకులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.