రోజురోజుకూ బలహీనపడుతున్న బీజేపీ.. ఒక్కొక్కరుగా కీలక నేతలు జంప్

బీజేపీలో నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన దాదాపు పది మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీని వీడారు.

Update: 2024-04-15 02:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన దాదాపు పది మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీని వీడారు. త్వరలోనే మరికొందరు నేతలు పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశం శ్రేణులను కలవరపెడుతోంది. రోజురోజుకూ బలహీనమవుతుండటంతో రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. నేతలు చేజారకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ నేతలు సమయం చూసి ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండటంతో చాపకింద నీరులా పార్టీ పరిస్థితి తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే ఒక్కసారిగా వెళ్తే బీజేపీ అలర్ట్ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో హస్తం పార్టీ సైతం ఆచితూచి ఒక్కొక్కరిని పార్టీలోకి లాగుతోంది.

డీకే అరుణకు చెక్?

అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు పది మంది అభ్యర్థులు బీజేపీకి గుడ్ బై చెప్పారు. అందులో ప్రధానంగా కూన శ్రీశైలం గౌడ్, పులిమామిడి రాజు, ఆరెపల్లి మోహన్, శ్రీగణేశ్, రవీంద్ర నాయక్, చలమల కృష్ణారెడ్డి, బాబు మోహన్, రథన్ పాండురంగారెడ్డి, జలంధర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. కాగా పార్టీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన వెళ్లాక ఆయన తనయుడు మిథున్ రెడ్డి, రథన్ పాండురంగారెడ్డి, జలంధర్ రెడ్డిని తనవెంట తీసుకెళ్లారు. ఇతర నేతలను కాంగ్రెస్‌లోకి లాక్కెళ్లి పాలమూరు లోక్‌సభలో బీజేపీలో కీలక నేతలు లేకుండా డీకే అరుణను ఒంటరిని చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో తనను ఎలా అయినా ఓడించాలని జితేందర్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో డీకే అరుణకు చెక్ పెడితే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సునాయసమని భావిస్తున్నారు.

చేజారకుండా ప్లాన్

పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో కమలం పార్టీ కనీసం 12 స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో వెళ్తోంది. ఈ తరుణంలో ఒక్కో నేత పార్టీకి గుడ్ బై చెబుతుండటంతో సమస్యగా మారింది. రాష్ట్ర నాయకత్వం పార్టీలో అసంతృప్తులెవరైనా ఉన్నారా? అనే ఆరా తీస్తోంది. చేజారకుండా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే నేతల మధ్య సమన్వయం కోసం కమిటీలు వేశారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు నేతలు రంగంలోకి దిగారు. అయినా ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇప్పటికే కూన శ్రీశైలం గౌడ్ పార్టీ వీడారు. ఆయన తర్వాత ఇంకొందరు నేతలు పార్టీ వీడుతారనే ప్రచారం జరుగుతోంది. మరి పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా చేజారకుండా ఉండేందుకు రాష్ట్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి.

Tags:    

Similar News