రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.. అమిత్ షా సవాల్
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అంటే భారతీయ భ్రష్టాచార్ సమితి అని అభివర్ణించారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కీలక ఆరోపణలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రజలను నిండా ముంచిందని అన్నారు. మరోవైపు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా కుంభకోణాల పార్టీ అని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తాము చెప్పేది అవాస్తమని చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేయాలని అన్నారు. కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అసలు ఇచ్చిన గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము అయోధ్యలో రామమందిరం నిర్మించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ ప్రజలకు న్యాయం చేశామని వెల్లడించారు. మజ్లిస్ అజెండాతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పనిచేస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు వారసత్వ పార్టీలే అని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి.. రాజకీయంగా లబ్ధిపొందేందుకే ఈ పార్టీలు పనిచేస్తాయని ఎద్దేవా చేశారు. మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు అందరికీ న్యాయం చేస్తున్నామని వెల్లడించారు.