దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్టార్ క్యాంపెయినర్‌లను శనివారం ప్రకటించింది. ఈ నెల 25న పోలింగ్ జరగనున్న ఢిల్లీ, హర్యానాలకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి, తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ సైతం ఉన్నారు. ఈ నెల 7న కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ముగియనున్న విషయం తెలిసిందే. మరోవైపు, లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించింది. దీంతో 7న మధ్యంతర బెయిల్‌పై ఢిల్లీ సీఎం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పార్టీ ఆయన పేరును సైతం స్టార్ క్యాంపెయినర్‌లా జాబితాలో చేర్చింది. వీరితోపాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పార్టీ లీడర్లు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా సహా తదితరుల పేర్లు జాబితాలో ఉన్నాయి. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆప్, కాంగ్రెస్ సమన్వయ కమిటీ శుక్రవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం మరుసటి రోజే ఆప్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేయడం గమనార్హం.