పిచ్చికుక్క దాడితో చిన్నారి మృతి..

పిచ్చికుక్క దాడిలో 45 రోజుల చిన్నారి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2024-06-18 09:12 GMT

దిశ, తొర్రూరు : పిచ్చికుక్క దాడిలో 45 రోజుల చిన్నారి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల తెలిపిన కథనం ప్రకారం తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన నకిరకంటి ముత్తయ్య, ఉప్పలమ్మ దంపతుల కుమార్తె రేణుకకు నెల్లికుదురు మండలం చెట్లముప్పారం గ్రామానికి చెందిన వెంకన్నతో ఐదేళ్ల క్రితం వివాహమైంది.

ఈ క్రమంలో వారికి మొదటి సంతానం బాబు పుట్టి అనారోగ్యంతో మృతి చెందగా, రెండవ సంతానంలో బాబు జన్మించాడు. మూడవ సంతానంగా జన్మించిన 45 రోజుల బాబును ఇంటి ఆరుబయట మంచంలో పడుకోబెట్టి ఇంట్లో వంట చేసేందుకు వెళ్లింది. ఇంట్లో నుంచి బయటకు వస్తుండగానే పిచ్చికుక్క బాబును ఎత్తుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి బాలుడు సోమవారం రాత్రి మృతి చెందాడు. దీంతో మడిపెళ్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News