90వ సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కీలక నిర్ణయం

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ 90వ సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా డైలమాలో ఉన్న దక్షిణాఫ్రికా పర్యటనలో కొన్ని మార్పులు చేసి ఏజీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం కోల్‌కతా వేదికగా జరిగిన ఏజీఎం అజెండాలో లేకపోయినా ప్రత్యేకంగా దక్షిణాఫ్రికా పర్యటన గురించి చర్చించారు. షెడ్యూల్ ప్రకారం టీమ్ ఇండియా ఈ నెల 9న ముంబై నుంచి జొహన్నెస్‌బర్గ్‌కు బయలుదేరాల్సి ఉన్నది. ఒమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో బీసీసీఐ దక్షిణాఫ్రికా పర్యటనలో మార్పులు […]

Update: 2021-12-04 09:52 GMT

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ 90వ సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా డైలమాలో ఉన్న దక్షిణాఫ్రికా పర్యటనలో కొన్ని మార్పులు చేసి ఏజీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం కోల్‌కతా వేదికగా జరిగిన ఏజీఎం అజెండాలో లేకపోయినా ప్రత్యేకంగా దక్షిణాఫ్రికా పర్యటన గురించి చర్చించారు. షెడ్యూల్ ప్రకారం టీమ్ ఇండియా ఈ నెల 9న ముంబై నుంచి జొహన్నెస్‌బర్గ్‌కు బయలుదేరాల్సి ఉన్నది. ఒమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో బీసీసీఐ దక్షిణాఫ్రికా పర్యటనలో మార్పులు చేసింది. షెడ్యూల్ ప్రకారం మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడాల్సి ఉన్నది. అయితే నాలుగు టీ20 మ్యాచ్‌లను పర్యటన నుంచి తప్పించింది. ప్రస్తుత పర్యటనలో కేవలం టెస్టులు, వన్డేలు మాత్రమే ఆడనున్నది. నాలుగు టీ20లు వచ్చే ఏడాది ఆడనున్నారు. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇరు దేశాల క్రికెట్ బోర్డులు చర్చించుకున్న తర్వాత వెల్లడించాలని ఏజీఎంలో నిర్ణయించారు. దీంతో పాటు ఏజీఎంలో పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకున్నారు. వాటిని బీసీసీఐ తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

రిటైర్మెంట్ వయసు పెంపు..

బీసీసీఐ తమ మ్యాచ్ అఫిషియల్స్, సహాయక సిబ్బంది రిటైర్మెంట్ వయసును పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 60 ఏళ్లు ఉన్న రిటైర్మెంట్ వయసును 65కు పెంచుతూ ప్రతిపాదన ఆమోదించింది. ఇది బీసీసీఐ, అనుబంధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల తరఫున నియమించబడిన అందరికీ వర్తించనున్నది. అయితే 60 ఏళ్ల తర్వాత ఆయా వ్యక్తుల ఫిట్‌నెస్‌ను పరిశీలించిన తర్వాతే 5 ఏళ్ల పెంపు వర్తిస్తుంది. ఎన్ఏసీలో పని చేస్తున్న కోచ్‌లు, ఇతర ట్రైనర్లకు కూడా రిటైర్మెంట్ వయసు పెంచారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఈ నిబంధనను వర్తింపజేయనున్నారు.

వీవీఎస్ దరఖాస్తు చేసుకోవాలి

నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ) చీఫ్‌గా రాహుల్ ద్రవిడ్ ఖాళీ చేసిన పోస్టులో వీవీఎస్‌ను నియమిస్తారని వార్తలు వచ్చాయి. అయితే వీవీఎస్ నియామకం పూర్తిగా నిబంధనల ప్రకారమే జరుగనుందని కార్యదర్శి జై షా చెప్పారు. అతను ముందుగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ, అపాయింట్‌మెంట్ ప్రాసెస్ జరుగుతుందని ఆయన అన్నారు. అంతే కాకుండా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ మెంటార్‌గా, టీవీ కామెంటేటర్‌గా, మీడియాలో కాలమ్స్ రైటర్‌గా ఇకపై వీవీఎస్ పని చేయకూడదనే షరతు ఉన్నది. అంతే కాకుండా ఆయన హైదరాబాద్ నుంచి కాక బెంగళూరులోనే ఉండాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఒప్పుకున్న తర్వాతే అతడి నియామకం గురించి అధికారికంగా వెల్లడించనున్నారు.

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యులుగా బ్రిజేష్ పటేల్, ఎంకేజే మజుందార్‌‌లను అధికారికంగా తీసుకున్నారు. ఇక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా ప్రజ్ఞాన్ ఓజాను నియమించారు. దీంతో పాటు బీసీసీఐ వార్షిక బడ్జెట్, ఆడిటెడ్ అకౌంట్లను ఏజీఎం ఆమోదించింది. ఈశాన్య రాష్ట్రాలు, పుదుచ్చేరి, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు సహకరించాలని నిర్ణయించింది. దీంతో పాటు అన్ని రాష్ట్రాల అసోసియేషన్లకు రూ. 10 కోట్ల చొప్పున ఇవ్వనున్నది. అన్ని రాష్ట్రాల్లో ఇండోర్ సౌకర్యాలను పెంచడానికి వీటిని ఉపయోగించాల్సి ఉన్నది.

అహ్మదాబాద్ పై నిర్ణయం ఆలస్యం..

అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్స్‌కు అప్పగించే విషయంలో ఇంకా డైలమా కొనసాగుతున్నది. సీవీసీ క్యాపిటల్స్‌కు బెట్టింగ్ కంపెనీలో ఫిర్యాదులు అందాయి. దీనిపై నలుగురు స్వతంత్ర సభ్యులతో కూడిన న్యాయ నిపుణుల బృందం విచారణ చేస్తున్నది. ఒక వేళ సీవీసీ క్యాపిటల్ కనుక అనర్హత వేటుకు గురైతే తర్వాత ఎక్కువ బిడ్ వేసిన అదానీ గ్రూప్‌కు అహ్మదాబాద్ ఫ్రాంచైజీని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ విషయం తేలిన తర్వాతే ఐపీఎల్ 2022కి సంబంధించిన మెగా ఆక్షన్ తేదీలను ప్రకటించనున్నారు.

Tags:    

Similar News