కాళేశ్వరం ప్రాజెక్ట్ వృథా.. ఇగో ప్రాక్టికల్ ప్రూఫ్స్
దిశ ప్రతినిధి, కరీంనగర్: గోదావరి నీటిని పూర్తి స్థాయిలో వాడుకునేలా రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి భారీ వరద దిగువకు వెళ్లిపోతోంది. మేడిగడ్డ బ్యారేజీ సామర్థ్యం 16 టీఎంసీలే ఉండడంతో వరద నీరు ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లు ఓపెన్ చేసి దిగువకు వదిలి పెడుతున్నారు. దీంతో వందల టీఎంసీల నీరు వృథా అవుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 700టీఎంసీల నీరు కిందికి వెళ్లింది. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఏటా […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: గోదావరి నీటిని పూర్తి స్థాయిలో వాడుకునేలా రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి భారీ వరద దిగువకు వెళ్లిపోతోంది. మేడిగడ్డ బ్యారేజీ సామర్థ్యం 16 టీఎంసీలే ఉండడంతో వరద నీరు ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లు ఓపెన్ చేసి దిగువకు వదిలి పెడుతున్నారు. దీంతో వందల టీఎంసీల నీరు వృథా అవుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 700టీఎంసీల నీరు కిందికి వెళ్లింది.
గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఏటా వృథాగా పోతున్న నీటిని వినియోగంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల చొప్పున వంద టీఎంసీల నీటిని ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోయాలి. తాజాగా అదనపు టీఎంసీని కూడా తరలించాలని నిర్ణయించి ఈ మేరకు పనులు చేపట్టింది. ఈ నీటిని సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకు వినియోగించాలని భావిస్తోంది. అయితే ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం ఆచరణలో సఫలం అయినా ఇంకా నీరు వృథాగానే పోతున్నాయి. వరద రూపంలో మేడిగడ్డ మీదుగా వెళ్తున్న జలాలు అంతకు మూడు రేట్ల వరకూ ఉండడం గమనార్హం. ఒక్క ఈ ఏడాది వచ్చిన నీటిని పరిగణనలోకి తీసుకుంటేనే ఈ విషయం స్పష్టం అవుతోంది.
మేడిగడ్డ నుంచి దిగువకు..
ఈ ఏడాది ఇప్పటి వరకు మేడిగడ్డ నుంచి సుమారు 700 టీఎంసీల నీటిని దిగువ ప్రాంతానికి వదలారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు మరో 200 టీఎంసీల నీటిని వదిలేసే అవకాశాలు ఉన్నాయని అంచనా. ఒక వేళ వరదలు మరింత ఉధృతంగా వస్తే అంతకు ఎక్కువగానే నీటిని దిగువ ప్రాంతానికి తరలించాలి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రధానంగా మేడిగడ్డకు గోదావరి ఎగువ ప్రాంతంతో పాటు, ప్రాణహిత నదుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఆ బ్యారేజ్ కెపాసిటీ 16 టీఎంసీల సామర్థ్యం మాత్రమే కావడంతో ఇన్ ఫ్లో ఎప్పటికప్పుడు అంచనా వేసి నీటిని వదిలేయడమే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే చెప్పాలి. ఒక వేళ మేడిగడ్డతో పాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద నీటిని నిల్వ ఉంచినా మొత్తం 38 టీఎంసీలకు మించే అవకాశం లేదు. ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసేందుకు చర్యలు తీసుకున్నా 100 నుంచి 150 టీఎంసీల నీటిని మాత్రమే తరలించే అవకాశం ఉంది. మిగతా నీటిని యథావిధిగా సముద్రంలోకి పంపించాల్సిందే..
ఆ సమయంలోనే అసలు సమస్య
వర్షాకాలంలో వరద ద్వారా వచ్చే నీటిని ఎగువకు ఎత్తిపోసేందుకు నిర్ణయించినప్పటికీ ఇదే సమయంలో గోదావరి నుంచి ఇన్ ఫ్లో పెద్ద ఎత్తున వస్తోంది. దీంతో ఎగువ ప్రాంతాలకు లిఫ్ట్ చేసే అవకాశం కష్టమేనని రెండు సీజన్‌లు ప్రాక్టికల్‌గా నిరూపించాయి. ఇన్ ఫ్లో తీవ్రంగా ఉన్నప్పుడు ఎల్లంపల్లి గేట్లు కూడా తెరిచి దిగువ ప్రాంతాలకు నీటిని వదులాల్సి వస్తోంది.