Harish Rao: సినిమా టికెట్ రేట్లపై రేవంత్ సర్కార్ యూ టర్న్? హరీశ్ రావు కీలక ట్వీట్

ఒక మహిళ మృతితో ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

Update: 2025-01-10 08:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఒక మహిళ మృతితో ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా తెలిపారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయని విమర్శించారు. అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎలా? అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇవ్వడం సభను అవమానించడమేనని ఆరోపించారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రిపై, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతామని కీలక నిర్ణయం తీసుకున్నారు.

మాట తప్పం , మడమ తిప్పం అంటూ బీరాలు పలికి ఇప్పుడు టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు? ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అని నిలదీశారు. గతంలో మీరు బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం వల్లే ఒక మహిళ మృతి చెందారు, మరో పసివాడు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ పాపం మీ ప్రభుత్వానిదే కదా రేవంత్ రెడ్డి.. ఆ దురదృష్ట ఘటనను మరిచిపోకముందే ఎందుకు ఈ యూ టర్న్? దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి? అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు.

Tags:    

Similar News