మిమ్మల్ని చూసే రాజకీయాలు నేర్చుకున్నా.. రాహుల్ కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
rahul
X

లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. అమేథీలో ప్రజలు ఇప్పటికీ అలాగే ఉన్నారని, కానీ ప్రభుత్వంపై ఉన్న కోపం కళ్ళలో కనిపిస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు 6 కిలోమీటర్లకు‌పైగా కాంగ్రెస్ నాయకులతో కలసి పాదయాత్ర నిర్వహించారు.

రాహుల్ మాట్లాడుతూ.. అన్యాయానికి వ్యతిరేకంగా మేము ఇప్పటికీ ఐక్యంగా ఉన్నాము. నేను 2004లో మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చాను. నేను తొలిసారిగా పోటీ చేసిన స్థానం అమేథీ. ఈ ప్రాంత ప్రజలు రాజకీయాల గురించి చాలా నేర్పారు. రాజకీయాల మార్గాన్ని మీరు నాకు చూపించారు. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు’ అని అన్నారు. మరోసారి రాహుల్ హిందుత్వవాది అనే పదాన్ని ప్రస్తావించారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బాధ, దుఃఖానికి హిందుత్వవాదులు ప్రత్యక్షంగా బాధ్యులని అన్నారు. దేశంలోని పరిస్థితుల గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ప్రశ్నలకు సీఎం యోగీ గానీ, పీఎం మోడీ గానీ సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. మోడీ నిర్ణయాలతో మధ్యతరగతి, పేద ప్రజలు దారుణంగా నష్టపోతున్నారని తెలిపారు. కాగా, 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 50 వేల పైచిలుకు ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారిగా అమేథీలో పర్యటించడం గమనార్హం.

Advertisement

Next Story