జో బైడెన్‌ వైపేనంటున్న అమెరికన్ యూత్

by Shyam |
జో బైడెన్‌ వైపేనంటున్న అమెరికన్ యూత్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సెగ పుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ట్రంప్‌-బైడెన్ ‌ల మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ సాగుతోంది.. గెలుపు కోసం ఇరువురూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అమెరికన్లను ఆకట్టుకొనేందుకు విశ్వప్రయత్నాలూ చేస్తున్నారు. మరి.. ఈసారి గెలుపెవరిది..? మళ్లీ విజయం ట్రంప్ దేనా..? లేదా బైడెన్‌ జయభేరీ మోగిస్తారా..? ఇంతకీ యూత్‌ ఎటువైపు..?

ఇటీవల హార్వర్డ్‌ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ సర్వే యూత్‌ నాడి తట్టే ప్రయత్నం చేసింది. ఈ సర్వేలో యువజనం బైడెన్‌ వైపే మొగ్గు చూపారు. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల యువత బైడెన్‌ వైపే నిలిచింది. తదుపరి అగ్రరాజ్య అధ్యక్షుడిగా బైడెన్‌ అయితేనే బాగుంటుందన్న అభిప్రాయం అక్కడి యువతలో ప్రస్ఫుటమవుతోంది. ఈ సర్వేలో కాలేజీల్లో చదువుతున్న యువతతో పాటు బయటి యువకులనూ పరిగణనలోకి తీసుకున్నారు. ఈసారి తాము తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటామని దాదాపు 63 శాతం మంది చెప్పారు. బరాక్‌ ఒబామా కాలంలో తాము సంతోషంగా ఉన్నామని.. ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పడం ద్వారా యువజనం ట్రంప్‌పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేసింది. 77 ఏళ్ల బైడెన్‌ ఆలోచనలు.. విధానాలు యువతను ఆకర్శిస్తున్నాయని చెప్పింది సదరు సర్వే. మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ వ్యక్తిగతమూ వారిని బైడెన్‌ వైపు నిలిచేలా చేసిందని పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ యువ ఓటర్ల పాత్ర కీలకమే. వారి ఓటింగ్‌ అధ్యక్ష అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తుంటుంది. అయితే.. ఇక్కడ ఓటేసేందుకు యువత ఎక్కువగా ఇష్టపడరు. ఇక్కడి రాజకీయ నాయకులు తమ సంక్షేమాన్ని పట్టించుకోరన్న భావన అమెరికా యూత్‌లో బలంగా నాటుకుపోయింది. దీనివల్లే ఓటింగ్‌కు మెజార్టీ యూత్‌ దూరంగానే ఉంటోంది.

ఓటేస్తే ఫలితం తారుమారే..

అమెరికా యూత్‌ ఓటెయ్యరు కానీ.. పోలింగ్‌లో పాల్గొంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఇందుకు ఒబామా గెలుపే ఉదాహరణ. 2008లో అధ్యక్షుడిగా ఎన్నికైన ఒబామాకు యువత బాసటగా నిలిచింది. రికార్డు స్థాయిలో ఒబామాకు ఓటేసింది. మరీ ఒబామా అంతగా కాకున్నా ప్రస్తుతం బైడెన్‌కూ మద్దతుగానే నిలుస్తోంది అమెరికా యూత్‌.

ముందస్తు ఓటింగ్‌ దిశగా యూత్‌

2016తో పోల్చితే ఈసారి ఓటేసేందుకు యువత ఉత్సాహం చూపుతోంది. 2016 కంటే ప్రస్తుతం 27 శాతం అధికంగా ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌ను యువకులు వినియోగించుకున్నారు. దీనిని బట్టే ఈసారి ఎన్నికల్లో యువత ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. 2019తో పోల్చితే జో బైడెన్‌ అభ్యర్థిత్వానికి ప్రస్తుతం యూత్‌ నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. రోజురోజుకూ బైడెన్‌కు మద్దతు పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ట్రంప్‌నకు ఓటమి తప్పకపోవచ్చు. జో బైడెన్‌ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టే ఛాన్స్‌ లేకపోలేదు.

Advertisement

Next Story

Most Viewed