ఎమ్మెల్యే కబ్జా చేశారని కూలగొట్టారు

by Shyam |   ( Updated:2023-03-20 21:43:11.0  )
ఎమ్మెల్యే కబ్జా చేశారని కూలగొట్టారు
X

దిశ, హుస్నాబాద్: జనగామ జిల్లా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి భూ వివాదంలో చిక్కుకున్నారు. చేర్యాల పట్టణంలోని పెద్దచెరువుకు చెందిన 21గుంటలు కబ్జా చేశారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. చెరువు వద్ద స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను మూకుమ్మడిగా కూల్చివేశారు. (వీడియో కింద ఉంది చూడవచ్చు)

సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ రాజకీయం కలకలం రేపుతోంది. ఇక్కడి పెద్ద చెరువు కింద భాగంలో దశాబ్ధాలుగా పట్టణ ప్రజలు పశువుల సంతగా వాడుకుంటున్నారు. ఈ భూమిని ఎమ్మెల్యే తన కూతురు తుల్జా భవానీ పేరిట కొనుగోలు చేశాడు. అ స్థలం బఫర్ జోన్‌ కావడంతో మునగకుండా కాంక్రీట్‌‌తో కాలువ నిర్మించాడు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుకు చేర్యాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా నిరసన తెలుపుతున్నారు. పట్టణ వాసులు శుక్రవారం చేర్యాల బంద్‌కు పిలుపునివ్వడం రాష్ట్రంలో కలకలం రేపుతున్నది.

రిజిస్ట్రేషన్ ముందే అనుమతి..

చేర్యాల పట్టణంలో పెద్ద చెరువు కింద 1402 సర్వే నెంబర్‌లో 21గుంటల భూమిని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన కూతురు తుల్జా భవానిరెడ్డితో పేరిట కొనుగోలు చేశారు. ఈ ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ చేశాడు. దశాబ్దాలుగా ఆ స్థలం పశువుల సంత కొనసాగుతుండటంతో పాటు ఇతర ప్రజా అవసరాలకు వినియోగిస్తున్నారు. అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టనీయొద్దని గతంలో స్థానికులు తీర్మానం చేశారు. కాగా ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ కన్నా ముందే ఎలాంటి టైటిల్ లేకుండా 2018లో ఎమ్మెల్యే కూతురి పేరిట చేర్యాల గ్రామపంచాయతీ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. చేర్యాల 2018లో మున్సిపాలిటీగా ఏర్పడింది. మున్సిపల్ ఏర్పడక ముందే ఆగమేగాల మీద గ్రామపంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారడంతో ఫైలును మాయం చేశారని చేర్యాల పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ పర్మిషన్ మీద చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని కొంత మంది కోర్టును కూడా ఆశ్రయించారు.

నిబంధనలకు పాతర..

2012లో జీవో నెంబర్ 168 ప్రకారం 25ఎకరాల ప్రభుత్వ శిఖం భూమి కంటే ఎక్కువ ఉన్నచో కట్ట కింద100 ఫీట్ల వరకు ఎలాంటి తవ్వకాలు, నిర్మాణాలు, భూ లావాదేవీలు జరుపకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను తుంగలో తొక్కిన ఎమ్మెల్యే తన కూతురు పేరిట కొనుగోలు చేసి ఆ భూమి ముంపునకు గురికాకుండా పక్కా ప్లాన్‌తో కాలువ నిర్మాణం చేపట్టారు. దీనిపై చేర్యాల పట్టణ వాసుల్లో ఆగ్రహాజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీల నేతల అంతా ఒక్కటై చేర్యాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. రూ.10కోట్ల విలువైన భూమిని ఆక్రమించడమేగాక అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, బీజేపీ, ఏఐఎఫ్‌బీ, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన చేస్తున్నారు.

ఎమ్మెల్యేకు ప్రజాగ్రహం తప్పదు: బొంగొని సురేశ్ గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు
చట్ట సభల్లో ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ఎమ్మెల్యే చెరువు మత్తడిపై కన్నేశాడు. అధికారుల ప్రలోభాలకు లొంగి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, అధికారులు వంతపాడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ప్రజలకు అన్యాయం జరిగితే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం.

కబ్జా చేసిన భూమి అప్పగించాలి: అందే అశోక్, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కబ్జా చేసిన భూమిని చేర్యాల ప్రజలకు అప్పగించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాభివృద్ది గాలికొదిలేసి అవినీతి, అక్రమాల పాల్పడుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలకులకు రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదు. ప్రభుత్వ భూములు కుటుంబ సభ్యులు, బినామీల పేరుతో కబ్జాలు చేయడం సరికాదు.

Advertisement

Next Story

Most Viewed