వసూల్ రాజా.. పంచాయతీ కార్యదర్శి వసూళ్ల బాగోతం బట్టబయలు..

by Sridhar Babu |
వసూల్ రాజా.. పంచాయతీ కార్యదర్శి వసూళ్ల బాగోతం బట్టబయలు..
X

దిశ, వెల్గటూర్ : ప్రతీ పనికి ఒక రేటు నిర్ణయిస్తూ కిషన్‌రావుపేట కార్యదర్శి కృష్ణారెడ్డి భారీ వసూళ్లకు పాల్పడుతున్నాడు. బుధవారం గ్రామంలో జరిగిన ఈజీఎస్ గ్రామసభలో కార్యదర్శి అక్రమాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వెల్గటూర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సంజీవ రావుకు ఫిర్యాదు చేశారు.

వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా, ధర్మపురి నియోజకవర్గం, వెల్గటూర్ మండలంలోని కిషన్‌రావుపేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న కృష్ణారెడ్డి భారీ వసూళ్లకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బండారి తిరుపతి అనే వ్యక్తి తన ఇంటికి మీటర్ కోసం కారదర్శి వద్దకు వెళ్లగా ఆయన రూ. 500 వసూలు చేశాడు. సమ్మెట వెంకటేష్.. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కళ్లం నిర్మించుకోగా రూ. 68,000 మంజూరయ్యాయి. కాగా వాటిని లబ్ధిదారునికి ఇచ్చేందుకు రూ.4000 లంచం తీసుకున్నాడు. ఇదే కళ్లం విషయంలో మాజీ ఎంపీటీసీ రాజేందర్ లంచం ఇవ్వనందుకు నానా ఇబ్బందులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నమనేని వెంకటేశ్వర రావు అడిగిన లంచం ఇవ్వనందుకు కళ్లం సాంక్షన్ చేయలేదు. శీలం అన్నపూర్ణ అనే మహిళ పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మారడం కోసం పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా సదరు మహిళ నుంచి రూ. 4వేలు లంచం తీసుకున్నాడు. మరొక నాలుగు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని బాధితురాలు వాపోయారు. గ్రామంలో 30 మందికి ఆగస్టు 24న ఇంకుడు గుంతలకు సంబంధించిన డబ్బులు రాగా వాటిని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడు. గ్రామసభలో నిలదీయడంతో వెంటనే ఆ డబ్బులు పంపిణీ చేశాడు.

గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన వాటికి దొంగ బిల్లులు పెట్టి.. బిల్లులను సాంక్షన్ చేయించుకున్నట్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభలో నిలదీయడంతో కొన్నింటిని ఒప్పుకున్నట్లు తెలిపారు. వీటన్నింటిని వివరిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సంజీవ రావుకు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ ఫిర్యాదుపై ఈ నెల 28న విచారణ జరుపనున్నట్లు తెలిపారు. ఆరోపణలు నిజమని తేలితే కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Next Story