నేటి నుంచి అన్ని దుకాణాలు ఓపెన్

by Shyam |
నేటి నుంచి అన్ని దుకాణాలు ఓపెన్
X

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి షాపింగ్ మాల్స్ మినహా ఇతర దుకాణాలన్నీ తెరవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం సరి, బేసి విధానంలో రోజుమార్చి రోజు తెరిచే విధానానికి స్వస్తి పలికింది. ఈ విధానం ద్వారా దుకాణాల దగ్గర రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన ప్రభుత్వం అన్ని దుకాణాలూ తెరుచుకోడానికి అనుమతి ఇచ్చింది. ఎక్కువ దుకాణాలు తెరవడం ద్వారా రద్దీని నివారించవచ్చని, తక్కువ మంది మాత్రమే పోగయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావించి. అన్ని దుకాణాలనూ తెరిచేలా నిర్ణయం తీసుకుంది. అయితే దుకాణాల యజమానులుగానీ, ప్రజలుగానీ కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం సూచించింది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా నగరంలోని అన్ని ప్రాంతాల్లో గురువారం నుంచి పూర్తి స్థాయిలో దుకాణాలు తెరుచుకోడానికి అవకాశం ఏర్పడింది.

జూన్ 1 నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణతో పాటు రానున్న వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా మురికి కాలువలను శుభ్రం చేయడం, వరద నీరు ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడం, రోడ్లపై గుంతలను పూడ్చడం, నీరు నిలవ లేకుండా చర్యలు తీసుకోవడం లాంటివి చేపట్టాలని సంబంధిత విభాగాల అధికారులను సీఎం ఆదేశించారు. నీటి పైపులైన్లలో లీకేజీ ఉంటే సరిదిద్దాలని, తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, దోమల లార్వాలను నిర్మూలన కోసం నివాస ప్రాంతాల్లో ఫాగింగ్ చేయాలన్నారు. జనం ఎక్కువగా ఉండే బస్టాండ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, రేషను దుకాణాలు తదితరాల ప్రాంతాల్లో క్రిమి సంహారక మందుల్ని స్ప్రే చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed