- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామగుండం ఓసీపీ-1 పేలుళ్లకు..కారణం అదేనా?
దిశ, కరీంనగర్: రామగుండం ఓసీపీ-1 ఫేజ్ 2లో జరిగిన మందుగుండు పేలుళ్లకు కారణం ఎమిటీ? మిస్ ఫైర్ అయిందని సింగరేణి వర్గాలు చెబుతున్నా..అసలు వాస్తవం వేరే ఉందా? ఇన్నిరోజులు జరగని ప్రమాదాలు ఈ మధ్యకాలంలో చోటుచేసుకోవడానికి మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే కారణమా..అన్న చర్చ కార్మిక వర్గాల్లో నెలకొన్నది. బ్లాస్టింగ్ జరిపేందుకు సింగరేణి సంస్థ అప్పగించిన కాంట్రాక్టు కంపెనీ ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ఓసీపీలో పనిచేసే సింగరేణి అధికారుల పర్యవేక్షణ కూడా అవసరం. బొగ్గును వెలికి తీసేందుకు ముందుగా నిర్దేశించిన ప్రాంతంలో గుంతలు తీస్తారు. అందులో స్లర్రీ అనే ఎక్స్‌ప్లోజివ్ పదార్థాన్ని నింపి డిటోనేటర్లతో అనుసంధానం చేస్తారు. మందుగుండు నింపే ముందు ఎండ తీవ్రతతో పాటు, అంతకుముందు బ్లాస్ట్ చేసిన గుంతల్లో ఇదివరకు అమర్చిన పేలుడు పదార్థాలు ఏమైనా మిగిలయా అనే విషయాన్ని కూడా పరిశీలించుకోవాల్సి ఉంది. అనంతరం ప్రాజెక్టు మొత్తం భారీ శబ్దంతో సైరన్ వినిపిస్తారు. ఇది విని ఆయా ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు సేఫ్ జోన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అన్ని ప్రాంతాల్లోని ఇన్‌చార్జీలు కూడా అంతా సేఫ్ అన్న సమాచారం అందుకున్నాకే మందుగుండు వేసిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్న సేఫ్టీ షెడ్‌లో ఉండి పేలుస్తారు.ఉదయం వేళల్లో మందుగుండు గుంతల్లో నింపుతున్నప్పుడు సింగరేణికి సంబంధించిన ఓర్ మెన్, బ్లాస్టింగ్ సర్దార్‌తో పాటు ఇతరాత్ర అధికార యంత్రాంగం కూడా తప్పనిసరిగా ఉండాలి. అంతా సవ్యంగా సాగిన తర్వాతే మధ్యాహ్నం 3.30 గంటలకు బ్లాస్టింగ్ చేస్తారు. అయితే మంగళవారం జరిగిన ఈ ప్రమాదం మాత్రం స్లర్రీ ఎక్స్‌ప్లోజివ్‌ను గుంతల్లో నింపి, డిటోనేటర్లను అనుసంధానం చేస్తున్నప్పుడు జరిగినట్టు తెలుస్తోంది. 80 గుంతలను తవ్వించిన కాంట్రాక్టు కంపెనీ 33 గుంతల్లో వేసిన స్లర్రీతో డిటోనేటర్లను అనుసంధానం చేస్తున్నప్పుడు సంభవించిందని తోటి కార్మికులు వెల్లడించారు.ఈ పని చేసేప్పుడు మొబైల్ ఫోన్లను కూడా అక్కడికి అనుమతించరు. కానీ, అనుకోకుండా మందుగుండు పేలడంతో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.ఇదిలాఉండగా ఓసీపీ-1లో పేలుళ్లకు..ఇంతకు ముందు బ్లాస్టింగ్ చేయగా మిగిలిన పదార్ధాల వల్లే జరిగి ఉండవచ్చునని సింగరేణి వర్గాలు అనుమానిస్తున్నారు.
39 ఏండ్ల తర్వాత..
సింగరేణి సంస్థలో బ్లాస్టింగ్ ప్రమాదం దాదాపు 39 ఏళ్ల తర్వాత జరిగింది. 1981లో 9 ఇంక్లైన్‌లో సంభవించిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు చనిపోయారు. మంగళవారం జరిగిన పేలుళ్లలో నలుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. సేఫ్టీ మేజర్స్ విషయంలో నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు స్పష్టం అవుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్న సింగరేణి యాజమాన్యం బ్లాస్టింగ్‌లను నిలువరించడంలో మాత్రం విఫలం అయిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
లంచ్ కెల్లారా?
రామగుండలోని ఓసీపీ-1 ఫేజ్2లో జరిగిన బ్లాస్టింగ్ సమయంలో సింగరేణి యాజమాన్యం తరఫున ప్రతినిధులు ఎవరూ లేరన్న చర్చ కార్మిక వర్గాల్లో సాగుతోంది. ఆ సమయంలో సంస్థ ప్రతినిధులు భోజనం చేసేందుకు వెళ్లారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయంలో బ్లాస్టింగ్ కాంట్రాక్టు సంస్థ ప్రైవేటు కార్మికులను పెట్టి అత్యంత ప్రమాదకరమైన పనులు చేయించేందుకు సాహసించడం విస్మయానికి గురిచేస్తోంది. అక్కడ కేవలం ఏడుగురు వ్యక్తులే ఉన్నారా లేక మరింత ఎక్కువ మంది ఉన్నారా అనే విషయాన్ని బయటకు రానివ్వడం లేదని సమాచారం.
ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు..
గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో ఓ వైపున మృతుల కుటుంబాలు, మరో వైపున క్షతగాత్రుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి.అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సింగరేణి దవాఖాన బాధిత కుటుంబాల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. తల, కడుపు పగిలి, కాళ్లూ చేతులు ఎగిరిపోయి హృదయ విదారక పరిస్థితుల్లో మృతి చెందిన కుటుంబ సభ్యులను చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అయ్యారు.
పరామర్శలు..
సింగరేణిలో జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఎంపీ వెంకటేశ్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆస్పత్రికి చేరుకుని ఘటన జరిగిన తీరును క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు యాజమాన్యం తరఫున కానీ, కాంట్రాక్టు సంస్థ నుంచి కానీ సాయం అందేలా చూస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి బీజేపీ అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ కూడా ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా గోదావరిఖనికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. బాధిత కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
బ్లాస్టింగ్‌కు బాధ్యులైన సింగరేణి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఎమ్మెస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య డిమాండ్ చేశారు. సేఫ్టీ సూపర్ వైజర్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. చనిపోయిన కుటుంబాలకు రూ. కోటి, క్షతగాత్రులకు రూ. 50 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కెంగెర్ల మల్లయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సింగరేణి ఏరియా ఆస్పత్రి ముందు కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి.
విచారణకు ఆదేశించాం: సీపీ
ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో ఉదయం 10.25 గంటలకు పేలుడు సంభవించిందని రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంపై ఎక్స్ ప్లోజివ్ సబిష్టన్స్ యాక్టు, 304ఏ సెక్షన్లలో కేసు నమోదు చేశామన్నారు. గుంతల్లో మందుగుండు వేసిన తరువాత మిషనరీతో డిటోనేటర్లను అమరుస్తుండగా పేలుడు జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో బండారి ప్రవీణ్ కుమార్, బిల్ల రాజేశం, అంజయ్య, ఎస్ రమేష్‌లు చనిపోగా, శంకర్, వెంకటేశం, భీమయ్య అనే కార్మికులకు గాయాలయ్యాయని చెప్పారు. ఈ ప్రమాదం నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేక డిటోనేటర్ల వల్లే జరిగిందా అన్న విషయంపై విచారణ జరిపిస్తామని చెప్పారు. అధికారులు మాత్రం డిటోనేటర్ల వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారని సీపీ వివరించారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో ఈ కేసును విచారిస్తున్నట్టు తెలిపారు. మందుగుండు సామగ్రిని సీజ్ చేసి ఎక్స్‌ప్లోజివ్ ఎనాలిసిస్ కోసం పంపిస్తామన్నారు. నిపుణులతో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మరల పునరావృతం కాకుండా సింగరేణి అధికారులచే కో-ఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.