- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కార్పొరేషన్‌పై ఆల్ పార్టీస్ ఫోకస్..
దిశ ప్రతినిధి, ఖమ్మం :
కార్పొరేషన్ ఎన్నికలపైనే అన్ని పార్టీలు గురిపెట్టాయి. జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో ఎన్నికలుండవచ్చని తెలుస్తుండడంతో పార్టీకి ప్లస్ అవుతుందని అనుకుంటున్న ఏ ఒక్క అవకాశాన్ని పార్టీలు, ముఖ్య నేతలు, వార్డుల నుంచి తాము బరిలో ఉంటామని ఆశిస్తున్న స్థానిక నేతలు వదులుకోవడం లేదు. కారు పార్టీ.. కాంగ్రెస్ పార్టీలు ప్రజాక్షేత్రంలోకి కదులుతున్నాయి.
అటు వామపక్షాలు, బీజేపీ సైతం నిత్యం ప్రజా పోరాటాల్లో నిమగ్నమవుతున్నాయి. పట్టణంలోని ప్రధాన సమస్యలపై అధికార పార్టీ, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనమని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. ప్రభుత్వ పథకాలు, కరోనా విషయంలో ప్రభుత్వం వైఫల్యం, పట్టణ సమస్యల పరిష్కారంలోని వైఫల్యాలను విపక్షాలు ఎండుగడుతున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యల కోసం ఎన్ని రోజులైన పోరాడుతామని ఉద్ఘాటిస్తున్నాయి. స్థానిక సమస్యలపై విపక్షాలు పోరాటం చేస్తుంటే.. స్థానిక సమస్యలపై తమ ప్రభుత్వానికి బాధ్యత ఉందని, ఇచ్చిన హామీలను నెరవేర్చామని ప్రారంభోత్సవాలతో గులాబీ పార్టీ హడావుడి చేస్తోంది.
రాజకీయ లెక్కలు..
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 50 వార్డుల్లో పార్టీలు తమ బలాన్ని, బలగాన్ని ఇప్పటి నుంచే లెక్కేసుకుంటున్నాయి. పార్టీకి ఆదరణ ఉందని అనుకుంటున్న వార్డులపై దృష్టి పెడుతూనే.. ఎన్నికల నాటికి మిగతా వార్డుల్లో పార్టీ బలం పెంపొందించు కునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగింది. ఈ సారి ఆ ప్రభంజనానికి అడ్డుకట్ట వేయాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతోంది. టీఆర్ ఎస్‌పై పట్టణ ఓటర్లు చాలా వ్యతిరేకతతో ఉన్నారని కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. వామపక్షాలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాయి. వామపక్షాలు కొన్ని డివిజన్లలో స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది.
గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు దక్కుతాయని ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. ఈ సారి కార్పొరేషన్ ఎన్నికల్లో వామపక్షాల సత్తా తప్పక తెలుస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతుండటం గమనార్హం. అదే సమయంలో టీఆర్ఎస్‌పై నెలకొన్న వ్యతిరేకత అంతా కూడా తమకు బలమే అవుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. ప్రతీ డివిజన్లో కాంగ్రెస్‌కు బలమైన మెజార్టీ ఉందని, పట్టణంలో కాంగ్రెస్‌కి పూర్వవైభవం కార్పొరేషన్ ఎన్నికల సాక్షిగానే జరుగుతుందని లెక్కలు వేసి మరీ చెబుతుండటం విశేషం. కారు పార్టీ దుర్భేద్యంగా కనబడుతుండగా.. అక్కడక్కడా లుకలుకలు పెరుగుతున్న మాట మాత్రం వాస్తవం. కారు పార్టీలో ఇప్పుడే డివిజన్ల వారీగా ఐదు నుంచి ఆరుగురు నేతలు టికెట్లను ఆశించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. డివిజన్ల వారీగా ఆ పార్టీలో ఎక్కువ మంది నేతలు ఉండటం బలంగా.. బలహీనతగాను మారే అవకాశం లేకపోలేదని ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలే పేర్కొంటున్నారు.
నెలరోజులుగా అధికార పార్టీపై కాంగ్రెస్ జిల్లా నేతలు తరుచూ విమర్శలకు దిగుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఖమ్మం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి, మురికివాడల్లో పర్యటించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అయితే మంత్రి అజయ్‌కుమార్ పట్టణాభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. రాక రాక ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధికి మంత్రి పదవి వస్తే ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతోందని విమర్శించారు. కాంగ్రెస్ కార్పొరేటర్‌గా ఉన్న డివిజన్లలో మంత్రి వారిని పిలవకుండానే ప్రారంభాలు చేస్తూ ప్రొటోకాల్ పాటించడం లేదని, ఆయనకు మంత్రిగా కొనసాగే కనీస అర్హత లేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ జాతీయ నాయకురాలు రేణుకా చౌదరి. అయితే ఆ తర్వాత టీఆర్‌ఎస్ నేతలు కూడా మంత్రి తరుఫున కౌంటర్ ఇచ్చారు. రెండు మూడు రోజులు విమర్శలు, ప్రతి విమర్శలతో ఖమ్మం రాజకీయం వేడెక్కింది. మొత్తంగా కార్పొరేషన్ ఎన్నికల సందడి అనుకున్న దానికంటే ముందే వచ్చేస్తోంది.