కార్పొరేషన్ దక్కించుకునేందుకు పార్టీల కసరత్తు

by Anukaran |
కార్పొరేషన్ దక్కించుకునేందుకు పార్టీల కసరత్తు
X

దిశ, ఖమ్మం ప్రతినిధి: కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అన్ని పార్టీలూ ఎదురుచూస్తున్నాయి.. ఈ నెల చివరన లేకుంటే జనవరి మొదటివారంలో వెలువడనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.. కాగా.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పునర్విభజన ప్రకారం ఖమ్మం కార్పొరేషన్లో 50 నుంచి 60 డివిజన్లకు పెరగనున్నాయి.. కాగా ఇప్పటికే అన్ని పార్టీలూ కార్పొరేషన్ గద్దెనెక్కడం కోసం వ్యూహరచన చేసుకున్నాయి.. రిజర్వేషన్ల ప్రాతిపదికన తమ కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి.. ఎలాగైనా సరే ఎక్కువ సీట్లు సాధించి తమ సత్తా చాటాలని ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.. టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు డివిజన్ల వారీగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండగా.. అసలు గత ఎన్నికల్లో ప్రభావం చూపని బీజేపీ ఏకంగా కార్పొరేషన్ పీఠం మాదే అంటూ సవాల్ విసురుతోంది..

అభివృద్ధి పేరిట అధికార పార్టీ..

గత ఎన్నికల్లో కార్పొరేషన్ పీఠం దక్కించుకున్న టీఆర్ఎస్.. ఈసారి కూడా ‘సీటు’ తమదేననే ధీమాతో ఉంది.. కాకపోతే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తోంది.. దానిలో భాగమే ఇటీవల మంత్రలు పర్యటన. అంతేకాదు ఐటీహబ్, నూతన కమిషనరేట్, రైతు వేదికలు ఇలా అభివృద్ధి బాట పడుతోంది.. నోటిఫికేషన్ వెలువడడానికి ముందు వరకు పలు పనులకు శంకుస్థాపనులు, ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలనేది టీఆర్ఎస్ వ్యూహం. పోయినసారి 50 డివిజన్లలో 34 టీఆర్ఎస్ గెలుచుకోగా.. ఏడుగురు కాంగ్రెస్ నుంచి ఇద్దరు వైసీపీ నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సారికూడా ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అత్యధిక స్థానాలు గెలిచేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నీ తానై దగ్గరుండి చూసుకుంటున్నారు.. కాగా గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కవగా సిట్టింగ్ కార్పొరేటర్ల సీట్లే గల్లంతయ్యాయి.. మంత్రి కేటీఆర్ స్వయంగా సిట్టింగ్ స్థానాల్లో ఎక్కువగా ఓడిపోయాం అని ప్రకటిచండంతో ఇక్కడి సిట్టంగుల్లో గుబులు పుట్టుకుంది. తమకు సీట్లు రాకుంటే ఎలా అనే అంతర్మథనంలో ఉన్నారు. కాగా అవకాశాన్ని బట్టి సీట్టిచ్చే పార్టీలోకి జంప్ చేసేందుకు సైతం సిద్ధమంటున్నారు.. అధికార పార్టీ ముఖ్య నేతల వర్గపోరుతో నలుగుతున్న ఖమ్మం.. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు పోగలుతుందా..? లేదా? చూడాలి మరి..

ఉత్సాహంలో కమలనాథులు..

దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు, గ్రేటర్ లో అత్యధిక స్థానాలకు ఎగబాకడంతో జోరుమీదున్న బీజేపీ ఖమ్మం కార్పొరేషన్ పై కన్నేసింది. తన కార్యాచరణను ఇప్పటికే మొదలు పెట్టిన కమల నాథులు మెల్లిగా డివిజన్ల వారీగా వ్యూహాలకు సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ విడుదల మొదలు తామేంటో చూపించాలని తహతహ లాడుతున్నారు. ఇప్పటికే భారీగా అన్ని పార్టీలనుంచి వలసలను ప్రోత్సహించిన బీజేపీ త్వరలో చేర్చుకునేందుకు రంగం కూడా సిద్ధం చేసుకుంది. గ్రేటర్ తరహాలో ఖమ్మంలో కూడా ప్రచార సరళి ఉండనుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎక్కువగా యువతకు, చదువుకున్న వారికి సీట్లు కేటాయించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళుతూ అడపాదడపా తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు.. మరి అధికార పార్టీని ఢీకొట్టి కాషాయ దళం ఎన్ని సీట్లు గెలుచుకుంటుందోననే చర్చ జరగుతోంది.

అభ్యర్థుల వేటలో కాంగ్రెస్ పార్టీ..

సరైన నాయకత్వం లేక జిల్లాలో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ.. కార్పొరేషన్ ఎన్నికల్లోనైనా ఎక్కువ డివిజన్లు సాధించి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపాలని ప్రయత్నిస్తోంది.. ఈ నేపథ్యంలోనే భట్టివిక్రమార్క అన్ని తానై శ్రేణులను ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే డివిజన్లను జోన్లుగా చేసి వాటికి ఇన్చార్జీలను కూడా కేటాయించారు. డివిజన్ల వారీగా కొందరికి బాధ్యతలను కూడా అప్పగించారు. ఇప్పటికే పలు డివిజన్లలో మీటింగ్ లను సైతం ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నారు.. ప్రభుత్వ వైఫల్యాను ఎండగడుతూ.. అధికారపార్టీ కార్పొరేటర్ల అవినీతి బాగోతాల మీద ఎక్కువగా ఫోకస్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. కాగా పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు కూడా లేని కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం సుకుంటుందో చూడాలి మరి.

ఉనికి కోసం లెఫ్ట్ పార్టీల ఆరాటం..

ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఖమ్మం నగరంలో.. ఆ పార్టీ ఇప్పుడు ఉనికికోసం పోరాడుతుందనే చెప్పాలి.. నాయకత్వ లేమితో కార్యకర్తలు కూడా చెల్లాచెదురయ్యారు. అయితే కొన్ని డివిజన్లలో ఇప్పటికీ సంప్రదాయ ఓటింగ్ అలాగే ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అడపాదడపా పోరాటం చేస్తూ ప్రజల్లో నిలుస్తున్నారు ఆపార్టీ నేతలు. గత ఎన్నికల్లో ప్రభావం చూపిన టీడీపీ సైతం జిల్లాలో పూర్తిగా కనుమరుగయ్యిందనే చెప్పాలి.. కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా పార్టీ కార్యకర్తలు ఉన్నా వారితో ఎలాంటి ప్రభావం ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

60కి పెరగనున్న డివిజన్లు..

వచ్చే మార్చితో నగరపాలక సంస్థ పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడైనా విడుదల కావచ్చనే సంతకేతాలు వెలువడుతున్నాయి.. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నారు. రిజర్వేషన్ ప్రక్రియ, డివిజన్ల పెంపుపై కసరత్తు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న జనాభా రీత్యా అదనంగా మరో పది డివిజన్లు పెరగనున్నాయి.. అంటే ఈసారి 60 డివిజన్లకు కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి.. డివిజన్ల వారీగా రిజర్వేషన్ కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు.. ఏది ఏమైనా ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీల దృష్టి అంతా ఖమ్మం కార్పొరేషన్ పైనే కేంద్రీకరించాయి.

Advertisement

Next Story

Most Viewed