వరాలా..? వడ్డింపులా..! నిర్మలమ్మ ఏం చెప్తారు?

by Anukaran |
వరాలా..? వడ్డింపులా..! నిర్మలమ్మ ఏం చెప్తారు?
X

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 సంవత్సరానికి సంబంధించి సోమవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆమెపైనే ఉంది. కరోనా కారణంగా దారుణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని దేశమంతా ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 7.7 శాతం ప్రతికూలంగా అంచనా వేసింది. ఇటీవల ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న పునరుద్ధరణను కొనసాగించే చర్యలను బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించే అవకాశాలున్నాయి.

ఐదు లక్షల రూపాయల ఆదాయం వరకు ఐటీ పన్ను లేకుండా ఉండాలని చాలా ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. కరోనాతో ఆర్థికంగా దెబ్బతిన్న పరిస్థితులలో ఈసారైనా అది నెరవేరుతుందా అని ఉత్కంఠగా వేచిచూస్తున్నారు. సెక్షన్ 80-సీ కింద జీవిత బీమా ప్రీమియం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్, ఈక్విటీ-లింక్‌డ్ సేవింగ్ స్కీములు, గృహ రుణాల మొత్తం, స్టాంప్ డ్యూటీ, ఆస్తి కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ చార్జీలు, సుకన్య సమృద్ధి యోజన వంటివి కూడా చర్చలలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరోనా పెను ఉపద్రవాన్నే తీసుకొచ్చింది. ప్రజల ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టింది. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. అన్‌లాక్ తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఇప్పటికీ నిరుద్యోగం తీవ్ర సమస్యగానే ఉంది. సామాన్యుల ఆదాయాన్ని పెంచడం, కొనుగోలు శక్తిని పెంచడం కేంద్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఇది జరిగితేనే ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుందన్న ఉద్దేశంతో ఎలాంటి రాయితీలు ఇస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినడంతో ‘కరోనా సెస్’ పేరుతో అదనపు వడ్డింపులు ఉండే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసలే ఆదాయ వనరులను కోల్పోయిన సమయంలో ఈ సెస్ అదనపు భారంగా మారే ప్రమాదం ఉంది.

ఆర్థిక రంగం ఊతం కోసం

రెండంకెల వృద్ధి రేటు కోసం కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపైనే దృష్టి పెట్టింది. మౌలిక సదుపాయాల రంగాన్ని ప్రధానమైనదిగా గుర్తించాలని, దీని ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాలని, తద్వారా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దేశంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలే కాబట్టి కరోనా సమయంలో మూతపడినవి తిరిగి తెరుచుకోడానికి అవసరమైన ఆర్థిక చేయూతను కేంద్ర ప్రభుత్వం నుంచే సమకూర్చడంతో పాటు ఇకపైన మరిన్ని రాయితీలు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను అధిగమించవచ్చన్నది నిపుణులు చేసిన ప్రతిపాదన. అయితే, బడ్జెట్‌లో ఏ మేరకు ఇవి ప్రతిబింబిస్తాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కరోనా కారణంగా లక్షలాది కుటుంబాలు వైద్య చికిత్స కోసం భారీ స్థాయిల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రులకు లక్షలాది రూపాయలు చెల్లించుకోలేక నానా అవస్థలు పడ్డారు. ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు, ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్సు సౌకర్యం పెద్దగా ఉపయోగపడలేదు. అనేక దేశాలు జీడీపీలో రెండంకెల స్థాయిలో వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు చేస్తూ ఉంటే భారత్ మాత్రం నామమాత్రంగానే ఖర్చు చేస్తన్నట్లు కరోనా సమయంలో పెద్ద చర్చే జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కనీసంగా రెండున్నర శాతమైనా కేటాయింపులు చేసే అవకాశం ఉందని తెలిసింది.

పెట్టుబడుల ఉపసంహరణ

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం భారత్ పెట్రోలియం, ఎయిర్ ఇండియా లాంటి సంస్థల విషయంలో ఇప్పటికే ప్రకటనలు చేశాయి. ఈ సంవత్సరం ఈ రెండు సంస్థలను అమ్మివేయడం ఖాయమని ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ ఆర్థిక సర్వే వివరణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ రెండు సంస్థల దారిలో మరికొన్ని కూడా ప్రయాణించే అనుమానం లేకపోలేదు. మరోవైపు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, ప్రైవేటీకరణను మరింత దూకుడుగా చేపట్టడం కూడా కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల్లో ప్రధానమైనవి. గత బడ్జెట్‌లో రూ.2లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించినా కరోనా వల్ల కేవలం రూ.15,220 కోట్లు మాత్రమే సాధ్యమైంది. ఈసారి బడ్జెట్‌లో అధిక పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్దేశించుకునే అవకాశాలున్నాయి. ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంది. ‘ఆత్మ నిర్భర్ భారత్’ ప్యాకేజీలో భాగంగా వ్యూహాత్మక రంగాల్లో గరిష్ఠంగా ప్రభుత్వ రంగ కంపెనీలు ఉంటాయని, ఇతర రంగాల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు ప్రైవేటీకరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. పెట్టుబడుల ద్వారా వచ్చే అధిక ఆదాయం ఖర్చులు పెంచేందుకు ప్రభుత్వానికి సాయంగా ఉంటుందని పేర్కొంది.

నిర్మలమ్మకు సవాళ్ళు

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే నిరుద్యోగం, ఆరోగ్య సంరక్షణ, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం మంత్రి నిర్మలకు సవాలుగా మారాయి. ఎన్నడూ లేనంత హెచ్చు స్థాయిలో వెంటాడుతున్న నిరుద్యోగం స్థానంలో ఉపాధి కల్పనకు మార్గాలను అన్వేషించడం ఆమెకు పరీక్షగా మారనుంది. మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి రంగం, రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం తదితరాలతో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చవచ్చని వ్యాపార-వాణిజ్య సంస్థల ప్రతినిధులు ఆమెకు సూచించారు. అన్నింటికంటే ఎంఎస్ఎంఈలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నందున కరోనా కాలంలో చతికిలపడిన ఆ పరిశ్రమలను పునరుద్ధరించడం, అందుకు కేంద్రం నుంచి చేయూత నివ్వడంపై నిర్మల ఏ ప్రతిపాదనలు సూచిస్తారనేది ఆసక్తికరం. కరోనా తర్వాత ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయినట్లు గ్రహించిన కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ నిర్ణయాన్ని తీసుకుంది. పరిస్థితి కొద్దికొద్దిగా మెరుగుపడుతోందన్న అభిప్రాయానికి వచ్చింది. జీఎస్టీ వసూళ్లే ఇందుకు నిదర్శనమని చెప్తోంది. ప్రజల ఆదాయాలు ఇంకా పూర్వ స్థితికి చేరుకోకపోవడంతోవారి కొనుగోలు శక్తి పెంచడం ప్రధానమని భావించింది. ఆ దిశగా ఇప్పుడు బడ్జెట్‌లో తగిన ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉంది. ప్రజల చేతుల్లో నగదు చెలామణితో ఆర్థిక వ్యవస్థ ఉత్తేజం పొందుతుందని, ఇందుకు ఎలాంటి రాయితీలు ప్రకటిస్తే ప్రయోజనకరంగా ఉంటుందనేది కేంద్రం ఆలోచన.

Advertisement

Next Story

Most Viewed