రామరాజు కోసం ఎదురుచూస్తున్న 'సీత' ను పరిచయం చేసిన జక్కన్న

by Shyam |   ( Updated:2021-03-15 01:15:45.0  )
రామరాజు కోసం ఎదురుచూస్తున్న సీత ను పరిచయం చేసిన జక్కన్న
X

దిశ, వెబ్ డెస్క్:ప్రపంచ సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కానుంది.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా, తారక్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన వీడియోలు, పోస్టర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు అలియా భట్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. రామరాజు సరసన సీతగా అలియా కనిపిస్తుంది. ఇక సీత పాత్రలో అలియా అదిరిపోయిందనే చెప్పాలి. సాంప్రదాయమైన దుస్తుల్లో రామరాజు కోసం ఎదురుచూస్తున్న అలియా లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఈ సినిమాతో అలియా భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ లో పాగా వేస్తుందో.. లేదో? చూడాలి.

Advertisement

Next Story

Most Viewed