ఊర్లలో పారుతున్న మద్యం వరద..

by Sridhar Babu |
ఊర్లలో పారుతున్న మద్యం వరద..
X

దిశ‌, ఖ‌మ్మం: మ‌ద్యం అమ్మ‌కాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం లాకులెత్త‌డంతో ఊర్ల‌ల్లో మద్యం వ‌ర‌దలా పారుతోంది. కేవ‌లం రెండ్రోజుల వ్య‌వ‌ధిలోనే ల‌క్ష‌ల విలువ చేసే మ‌ద్యం బెల్టుషాపుల‌కు చేరుకుంది. బార్ షాపుల‌ను మ‌రిపించేలా కొన్ని ఊర్ల‌ల్లో బెల్ట్‌షాపులు కొన‌సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే, మ‌ద్యం దుకాణ వ్యాపారులే స్వ‌యంగా కొన్ని గ్రామాల్లో, తండాల్లో బెల్ట్‌షాపుల‌ను నిర్వ‌హిస్తుండ‌టం గ‌మ‌నార్హం. కావాల్సినంత స‌రుకు రాత్రి, ప‌గ‌లు అనే తేడా లేకుండా తరలిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌ద్యం అమ్మాకాల‌పై దాదాపు 60 శాతం వ‌ర‌కు ధరలు పెంచి విక్రయిస్తోంది. తెలంగాణ‌లో మాత్రం ధరలు 16 శాతం మాత్రమే పెరిగాయి. దీంతో త్వ‌ర‌లో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రోమారు ధ‌ర‌లు పెంచుతుందన్న అనుమానాల‌తో దుకాణాల్లో మొత్తం స‌రుకును బెల్ట్‌షాపుల‌కు లేదా ర‌హస్య ప్ర‌దేశాల‌కు షిఫ్ట్ చేస్తున్నారు వ్యాపారులు. దీనికితోడు డిమాండ్‌కు స‌రిప‌డా స‌ప్లై లేద‌నీ, త్వ‌ర‌లోనే మ‌ద్యం కొర‌త ఏర్ప‌డుతుంద‌న్న అంచ‌నాలూ వ్యాపారుల్లో ఉన్నాయి. ఈ కార‌ణాల‌తో చాలామంది నిల్వ ఉంచుకునేందుకు వైన్ షాపుల‌ను ఖాళీ చేస్తున్నారు. ఇందుకోసం రాత్రివేళ‌ల్లో వైన్ షాపుల నుంచి వాహ‌నాల్లో ర‌హస్య ప్ర‌దేశాల‌కు తరలిస్తున్నారు.

పాల్వంచ నుంచి మద్యం తరలిస్తుండగా..

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ల‌క్ష్మీదేవిప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధి దుబ్బతండాలో బుధ‌వారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో అక్ర‌మంగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న భూక్య వెంక‌న్న అనే వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 97 పెట్టెలలో సుమారుగా రూ.9,50,000 విలువ గల మ‌ద్యాన్ని బొలెరో వాహనంలో పాల్వంచ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర వైన్స్ నుంచి ఇంటికి తరలిస్తున్నాడు. ఆ సమయంలో పోలీసులు దాడి చేసి ప‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో జ‌రుగుతున్న మ‌ద్యం త‌ర‌లింపు వ్య‌వ‌హారానికి ఈ ఘ‌ట‌న నిదర్శ‌నం. పోలీస్‌, ఎక్సైజ్ శాఖ‌లోని కొంత‌మంది అధికారుల సాయంతో త‌మ య‌వ్వారాన్ని చ‌క్క‌బెట్టుకునే వ్యాపారులు చాలామంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొంత‌మంది వైన్‌షాపుల య‌జ‌మానులు ఏకంగా పోలీసుల‌కు, ఎక్సైజ్ అధికారుల అనుమ‌తితోనే స‌రుకును బెల్ట్‌షాపుల‌కు తరలిస్తున్నారని సమాచారం.

అధికారి అనుమతి‌తోనే..!

‘‘లాక్‌డౌన్‌లో జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకోవాలంటే మీ స‌హాయం త‌ప్ప‌క అవ‌స‌రం సార్‌.. కొద్దిరోజులు స‌హ‌క‌రించండి..మిమ్మ‌ల్ని చాలా రోజులు గుర్తు పెట్టుకుంటాం’’ అంటూ ఖ‌మ్మం జిల్లాకు చెందిన కొంత‌మంది వ్యాపారులు ఓ కీల‌క‌ అధికారిని క‌లిసిన‌ట్లు స‌మాచారం. స‌ద‌రు అధికారికి స‌న్నిహితంగా మెలిగే రాజ‌కీయ నేత‌ను కలిసి వ్యాపారులు రిక్వెస్ట్ చేశార‌ట‌. ఇందుకు ఆ అధికారి కూడా ‘‘ఏమోన‌య్యా..అంతా స్టిక్ట్‌గా ఉంది వ్య‌వ‌హారం..కానివ్వండి’’ అంటూ అనుమ‌తిచ్చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇలా అధికారుల‌కు మాముళ్లు ఆశ చూపి మ‌ద్యం త‌ర‌లింపున‌కు ఆటంకాలు తొల‌గించేసుకుంటున్నారు కొందరు. ఆ విధంగా బెల్ట్‌షాపుల‌కు మ‌ద్యం త‌ర‌లిస్తూ ఎమ్మార్పీ ధ‌ర కంటే క్వార్ట‌ర్ సీసా, బీరుపై అద‌నంగా రూ.20 నుంచి 30 వ‌ర‌కు విక్ర‌యిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

Tags: covid 19 affect, lock down, but, relaxation, wine shops, open, alcohol, flow, villages, permission

Advertisement

Next Story

Most Viewed