‘జీతాల చెల్లింపునకు మరో మూడ్రోజులు’

by srinivas |
‘జీతాల చెల్లింపునకు మరో మూడ్రోజులు’
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సమస్య మూడు రోజుల్లో పరిష్కారమవుతుందని సీఎం ముఖ్య సలహాదారు అజేయ్ కల్లం తెలిపారు. జీతాల ఆలస్యంపై ఆయన మాట్లాడుతూ, ద్రవ్య వినిమయ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకపోవడమే జీతాల ఆలస్యానికి కారణమని అన్నారు. ఆర్డినెన్స్ సాయంతో గత నెల 30వ తేదీ వరకు జీతాలు, ఖర్చులు చేశామని ఆయన అన్నారు. శాసనమండలి సమావేశాల్లో ద్రవ్య బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ఉద్యోగుల వేతనాలు ఆలస్యం అయ్యాయని ఆయన తెలిపారు. గవర్నర్ ఆమోదంతో రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.

రాజ్యాంగ ప్రకారం… అసెంబ్లీలో ఆమోదం పొందిన ద్రవ్య బిల్లు శాసనమండలి ఆమోదానికి వెళ్లి తిరిగి అసెంబ్లీకి రాకపోతే దానిని 14 రోజుల తరువాత అసెంబ్లీ కార్యదర్శి గవర్నర్‌కు పంపే వీలుంటుందని ఆయన తెలిపారు. గవర్నర్ ఆ బిల్లును ఆమోదిస్తే ప్రభుత్వం ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుందని ఆయన చెప్పారు. కాగా, ఏపీలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్‌ను శాసన ఆమోదించినప్పటికీ, శాసన మండలి ఆమోదించలేదు. దీంతో ప్రభుత్వ నిధులు ఖర్చు చేసే వెసులుబాటు కలుగలేదు. దీంతో నిబంధనల ప్రకారం మండలికి వెళ్లిన 14 రోజుల తర్వాత ఆ బిల్లు గవర్నర్‌కు చేరేందుకు ప్రభుత్వం వేచి చూస్తోంది. గత రాత్రితో ఆ గడువు ముగియడంతో బిల్లును ప్రభుత్వం గవర్నర్‌కు పంపేందుకు కసరత్తులు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed