భారత్‌లో 5జీ సేవలందించేందుకు క్వాల్‌కమ్‌తో ఎయిర్‌టెల్ డీల్!

by Harish |
భారత్‌లో 5జీ సేవలందించేందుకు క్వాల్‌కమ్‌తో ఎయిర్‌టెల్ డీల్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా 5జీ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో 5జీ సేవలను ఈ ఏడాది చివరిలోగా ప్రారంభించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ భారత్‌లో 5జీ సాంకేతికతను తీసుకురావడానికి ప్రముఖ టెక్ సంస్థ క్వాల్‌కమ్‌తో భాగస్వామ్యాన్ని మంగళవారం ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలను దేశమంతటా తగిన ధరల్లో, వేగవంతంగా 5జీ సేవలను విస్తరించేందుకు వీలవుతుందని ఎయిర్‌టెల్ తెలిపింది.

అలాగే, ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు 5జీ సేవలను అందించేందుకు క్వాల్‌కమ్ సామర్థ్యాలను వినియోగిస్తుందని పేర్కొంది. క్వాల్‌కమ్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించి వర్చువల్‌గా 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ఏర్పాటులో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నట్టు ఎయిర్‌టెల్ వివరించింది. కాగా, ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారిగా 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షించిన సంస్థ ఎయిర్‌టెల్ రికార్డు సాధించింది. హైదరాబాద్‌లో ప్రత్యక్ష ప్రకటనను 5జీ నెట్‌వర్క్ ద్వారా ప్రసారం చేసి ఈ ఘనతను దక్కించుకుంది. ఈ క్రమంలోనే క్వాల్‌కమ్‌తో 5జీ బ్రాడ్‌బ్యాండ్ సేవలని ప్రారంభించాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed